సోలార్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ : పీయూష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను సోలార్ హబ్‌గా మారుస్తామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్ఫష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. అనంతరం పీయూష్ గోయల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో కంటే చాలా వరకు విద్యుత్ కోతలు తగ్గాయని చెప్పారు. ఆ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు కేంద్రం అదనంగా విద్యుత్ అందిస్తుందని తెలిపారు.
అందులోభాగంగా ఆ రాష్ట్రంలోని పవర్ ప్రాజెక్టులకు అదనంగా బొగ్గు కేటాయిస్తామన్నారు. భారతదేశాన్ని కరెంటు కోతలు లేని దేశంగా మార్చడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విద్యుత్ సమస్యపై కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని వెల్లడించారు. ఆ ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటే ఎటువంటి సమస్యలుండవని పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు.