ఇక పీఎఫ్ విత్‌డ్రాయల్ 75 శాతమే!
న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) సభ్యులు తమ భవిష్య నిధి నుంచి గడువుకు ముందే విత్‌డ్రా చేసుకునే నగదును 75 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగతా మొత్తం(25%) ఆ సభ్యులు 58 ఏళ్ల వయసు వచ్చేంతవరకు ఈపీఎఫ్ఓ వద్దే ఉంటుంది. ఈ ప్రతిపాదనను కార్మిక శాఖ అనుమతి కోసం పంపించారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నందువల్ల 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలన్ వెల్లడించారు.
గృహనిర్మాణం, పెళ్లి, పిల్లల చదువు తదితర కారణాలకు కూడా ఈ 75% పరిమితి వర్తిస్తుందన్నారు. పీఎఫ్ ఉద్దేశం వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించడమని, దానికి కాకుండా మరే కారణానికి ఆ మొత్తాన్ని ఉపయోగించడం సరికాదని తాము భావిస్తున్నామని వివరించారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. 58 ఏళ్ల లోపు వయసున్న ఈపీఎఫ్ఓ సభ్యులు గత రెండు నెలలుగా తమకే ఉద్యోగం లేదన్న కారణం చూపుతూ మొత్తం పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.