ఐఏఎస్ దంపతుల అవినీతిపై విచారణ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ దంపతుల్ని విచారించేందుకు కేంద్రప్రభుత్వం లోకాయుక్తకు అనుమతిచ్చింది. అరవింద్ జోషీ, టినూ జోషీ అనే ఐఏఎస్ దంపతులు ఆదాయానికి మించి 41 కోట్ల రూపాయిలు కూడబెట్టినట్టు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. వీరిద్దరినీ విచారించేందుకు లనుమతివ్వాలని లోకాయుక్త కోరగా, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జోషీ దంపతులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరిద్దరిపై చార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు లోకాయుక్త వర్గాలు తెలిపాయి. జోషీ దంపతులతో పాటు మరో 15 మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అరవింద్ తండ్రి హెఎం జోషీ, తల్లి నమ్రతా జోషీ, సహాయకులపై చార్జిషీట్ వేయనున్నారు. 1979 బ్యాచ్‌కు చెందిన జోషీ దంపతుల ఇంటిపై 2010లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరిపి అక్రమాస్తుల్ని గుర్తించారు.