అసెంబ్లీలో భవన దుమారం
తిరువారూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెంట్రల్ వర్సిటీ భవనం కూలిపోయిన ఘటన సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలను కుదిపేసింది. దీనిపై మాట్లేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.డీఎంకేతో కలిసి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:వన్నిలం సమీపంలోని నెలకుడిలో కూలిపోయిన సెంట్రల్ వర్సిటీ భవనం విషయంపై అసెంబ్లీ దద్దరిల్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృత్యువాతపడిన విషయం విదితమే. ప్రశ్నోత్తరాల సమ యం ముగియగానే డీఎంకే సభ్యులు స్టాలిన్ ఈ విషయమై మాట్లాడటం ప్రారంభించగానే స్పీకర్ ధనపాల్ అడ్డుకున్నారు. భవన ప్రమాదంపై డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి ఉన్నందున ముఖ్యమంత్రి సమాధానం చెబుతారని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మృతులకు ప్రభుత్వం తలా రూ.5లక్షలను నష్టపరిహారంగా చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత డీఎంకే సభ్యులు దురైమురుగన్ మాట్లాడుతూ భవన ప్రమాదం మాత్రమే కాదు అనేక ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీ సమావేశాలకు మరో రెండు రోజులే గడువు ఉందని అన్నారు.
మళ్లీ స్పీకర్ కలుగజేసుకుంటూ ఈ విషయాలన్నీ తనకు తెలుసునని, అనవసర చర్చలను అనుమతించేది లేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో దురైమురుగన్‌కు, మంత్రులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణాల్లో నిర్లక్ష్యం పేద కార్మికుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదని వ్యాఖ్యానించారు. వేలూరు కలెక్టర్ కారు కిందపడి యువకుడు మరణించిన ఘటనపై మాట్లేడేందుకు దురైమురుగన్ కోరగా స్పీకర్ నిరాకరించారు. డీఎంకే సభ్యుల విమర్శలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే, తదితర నాలుగు పార్టీల సభ్యులు అసెంబ్లీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
కెప్టెన్ కలకలం..
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా వ్యవహరిస్తున్న డీఎండీకే అధినేత విజయకాంత్ సోమవారం అకస్మాత్తుగా సచివాలయానికి హాజరై కలకలం సృష్టించారు. ఉదయం 11.25 గంటలకు సచివాలయానికి చేరుకుని అసెంబ్లీ రిజిస్టరులో సంతకం చేసి వెంటనే వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మళ్లీ వచ్చారు. నోటికి నల్లగుడ్డలు ధరించి అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహిస్తున్న బహిష్కృత డీఎండీకే సభ్యులను పరామర్శించారు. జయ మార్గదర్శకంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని ముఖ్యమంత్రి చెప్పుకున్నారని, దీని అర్థం అక్రమార్జనతో కోర్టులో దోషిగా నిరూపితమైన జయ నేతృత్వంలో ప్రవేశపెట్టడమా అంటూ మీడియా వద్ద విజయకాంత్ ఎద్దేవా చేశారు. ‘ఇది కూడా ఒక అసెంబ్లీనా వచ్చేయండి పోదాం’ అంటూ ధర్నాలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని వెళ్లిపోయారు.
భవనం కేసులో నలుగురి అరెస్ట్..
భవనం కూలిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ భవన నిర్మాణ కాంట్రాక్టు పొంది ఉన్న టీఈఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ జనరల్ మేనేజర్ ఆనంద్ (26)తో పాటు తిరుచ్చికి చెందిన ఆంథోనీ అమల్ ప్రభు (31), మయిలాడుదురైకి చెందిన మేస్త్రీ అయ్యనార్ (32), కురుంగుళంకు చెందిన సూపర్వైజర్ సతీష్‌కుమార్ (25)ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు. మృతుల కుటుంబాలకు తలా రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.