రైల్వే మేనేజర్ కార్యాలయంలో సెంట్రల్ విజిలెన్స్ దాడులు
తిరుపతి అర్బన్: లంచం తీసుకున్నాడంటూ రైల్వే సెంట్రల్ విజిలెన్స్‌కు అందిన ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ రైల్వే విజిలెన్స్ అధికారులు తిరుపతి రైల్వే స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో బుధవారం సోదాలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7.45 గంటల వరకు సోదాలు కొనసాగించిన అధికారులు చివరకు మీడియాకు సమాచారం చెప్పకుండానే వెనుదిరిగారు.
సోదాలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న మీడియా సిబ్బంది మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో స్టేషన్‌కు చేరుకున్నారు. విజిలెన్స సిబ్బంది వీరికి ఎలాంటి సమాచారమూ చెప్పలేదు. రాత్రి 8 గంటల వరకు సోదాలు చేశారు. చివరకు మీడియా ఓ వైపు గేట్ వద్ద వేచి ఉండగా మరో వైపు గేట్ నుంచి వెళ్లి విజయవాడ రైలు ఎక్కేశారు. సోదాల్లో ఏం వెలుగు చూసిందో చెప్పకుండానే వెళ్లిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కాగా, వాణిజ్య సముదాయాల నుంచి అందుతున్న నెలవారి మామూళ్లు స్టేషన్ మేనేజర్ ఒక్కరే తీసుకుంటున్నారన్న వ్యవహారంపై కొన్ని నెలలుగా అంతర్గత విభేదాలు ఉన్నాయని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో మంగళవారం రాత్రి తిరుపతికి సెంట్రల్ విజిలెన్స్ అధికారులు చేరుకున్నారన్న సమాచారం తెలుసుకున్న కొందరు సిబ్బంది, బుధవారం మధ్యాహ్నం స్టేషన్ మేనేజర్ భోజనానికి వెళ్లినప్పుడు ఆయన టేబుల్‌పై ఉన్న రిజిస్టర్లో రూ.10 వేలు పెట్టి విజిలెన్స్‌కు చిక్కేలా చేశారని మరికొందరు అనుకుంటున్నారు. అయితే విజిలెన్స్ అధికారులు చెబితే గానీ వాస్తవం ఏంటనేది వెలుగులోకి రాదు.