చిన్న పట్టణాల్లోనూ మహీంద్రా ఫస్ట్ చాయిస్
* సర్టిఫైడ్ యూజ్డ్ కార్లకు డిమాండ్
* కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీ బ్రాండ్ సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయంలో ఉన్న మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ (ఎంఎఫ్సీడబ్ల్యుఎల్) చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా సంస్థకు 701 ఔట్లెట్లున్నాయి. ఇందులో 300 కేంద్రాలు చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యాయని, వీటి సంఖ్యను 2018 కల్లా రెండింతలు చేస్తామని కంపెనీ సీఈవో నాగేంద్ర పల్లె తెలిపారు.
తెలంగాణలో కంపెనీ 12వ ఔట్లెట్ ‘పారమౌంట్ ఆటోబే సర్వీసెస్’ను ప్రారంభించిన సందర్భంగా రిటైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ నాగర్, జోన్ హెడ్ సురేశ్ కుమార్తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల విక్రయాల్లో మెట్రో నగరాల వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైతే, చిన్న పట్టణాల్లో రెండంకెలుందన్నారు. సర్టిఫైడ్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నందునే 3, 4, 5వ శ్రేణి పట్టణాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు తెలిపారు.
మూడున్నరేళ్లకో కారు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల విక్రయాలు 17 శాతం వృద్ధితో 30 లక్షల యూనిట్లు నమోదవుతాయన్న అంచనాలున్నాయి. పరిశ్రమలో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం. ఇందులో తొలి స్థానంలో ఉన్న మహీంద్రాకు 24 శాతం వాటా ఉందని నాగేంద్ర వెల్లడించారు. ‘కస్టమర్లు మూడున్నరేళ్లకో కారును మారుస్తున్నారు.
పాత కారు సగటు అమ్మకం ధర రూ.3.65 లక్షలుంది. రూ.3.5-7 లక్షల ధరలో లభించే కార్ల విక్రయాలు మూడింట రెండొంతులు కైవసం చేసుకున్నాయి. సర్టిఫైడ్ కార్లకు బ్యాంకులు 85 శాతం రుణమివ్వడం కలిసి వచ్చే అంశం’ అని తెలిపారు. కంపెనీకి గ్రామీణ ప్రాంతాల నుంచి 35 శాతం అమ్మకాలు నమోదవుతున్నాయి.