ఈ వయసులో ఆ చికిత్స సాధ్యమేనా?
నా వయసు 32. నాకు పై దవడలో ఉన్న కోరపళ్లు కొద్దిగా వెనక్కి ఉన్నాయి. వాటిని సరిచేయించుకోవాలని ఉంది. దీనికోసం నేను ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. సిరామిక్ బ్రేసెస్ విధానం గురించి విన్నాను. ఈ వయసులో ఈ చికిత్స సాధ్యమేనా? ఈ ట్రీట్మెంట్కి ఎంతకాలం పడుతుంది? బ్రేసెస్ వేయించుకున్న తరవాత పళ్లు నార్మల్ కావడానికి ఎన్నిరోజులు పడుతుంది. మరో మూడునెలల్లో నా పెళ్లి. అప్పటికినా ట్రీట్మెంట్ పూర్తవుతుందా? నాకు తగిన సలహా, సూచనలు ఇవ్వగలరు.
- నాగేంద్రకుమార్, కొత్తగూడెం
వెనుకగా ఉన్న మీ పళ్లను ముందుకు తీసుకురావడం సాధ్యమే. అయితే ఈ చికిత్సకి సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. ముందుగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఎక్స్రే తీసి నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అలాగే మౌల్డ్స్ గురించి చికిత్స ప్రారంభించడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మూడు నెలలలో చికిత్స చేయడమనేది అసాధ్యం. మీ పలువరుస సక్రమంగా లేకపోతే మాత్రం మీ దవడలకు కాస్మొటిక్ సర్జరీ లేదా ఆర్థోనాటిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది.
ఒకవేళ ఈ చికిత్స అనివార్యమయితే, మీరు తప్పనిసరిగా మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని సంప్రదించవలసి ఉంటుంది. ఈ విధానం వల్ల చికిత్స నూటికినూరు శాతం సక్సెస్ అవుతుంది. ఈ చికిత్స చేసేవారు హైదరాబాదు నగరంలో చాలామంది ఉన్నారు. చాలా సందర్భాలలో సర్జరీకి ముందు, తరవాత కూడా కొద్ది కాలం పాటు క్లిప్పులను ఉపయోగించవలసి ఉంటుంది. మంచి మంచి పరికరాలు, మంచి వైద్యవిధానం మనకి అందుబాటులో ఉంది.
చాలామందికి ఈ విధానం వల్ల చాలా సమస్యలు వస్తాయని, అంతేకాక పరిస్థితి చాలా దయనీయంగా మారుతుందనే అపోహ ఉంది. ఇది ఎంతమాత్రం వాస్తవం కాదు. ఈ చికిత్స వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు. దీని గురించి తెలియనివారు చెప్పే మాటలను వినకండి. మీరు సరయిన మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ని కలిస్తే అన్ని అపోహలు తొలగిపోతాయి.
డాక్టర్ పార్థసారథి
కాస్మటిక్ డెంటల్ సర్జన్,
పార్థా డెంటల్, హైదరాబాద్