ముగ్గురిని రక్షించి.. తాను గల్లంతై..
ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి వంకలో పడ్డ ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి
వారిని రక్షించి తూములో పడి ప్రవాహంలో కొట్టుకుపోయిన 65 ఏళ్ల వృద్ధుడు
పోలీసుల ముమ్మర గాలింపు
పూతలపట్టు: ముగ్గురిని ప్రమాదం నుంచి రక్షించడం కోసం ఓ వృద్ధు డు తన ప్రాణాలను పణంగా పెట్టి న ఘటన పూతలపట్టు మండలంలోని యం.బండపల్లె వంకలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పూ తలపట్టు, పెనుమూరు పోలీసుల కథనం మేరకు.. జీడీ నెల్లూరు మండలం కొట్రకోణ గ్రామానికి చెందిన కె. కృష్ణయ్య(65) కొంత కాలంగా పెనుమూరు మండలం కలికిరి గ్రామంలోని తన కూతురు వద్ద ఉంటున్నాడు. శుక్రవారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు యం.బండపల్లె నుంచి తూపల్లె మీదుగా వెళ్లే వంతెనను దాటుతున్నాడు. ఈ సమయంలో ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వంతెనను దాటుతుండగా అదుపుతప్పి నీటిలో పడ్డారు. వెంటనే కృష్ణయ్య వారిని కాపాడాడు.
ఇదే క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న తూములో పడ్డాడు. ఎన్టీఆర్ జలాశయానికి కేవలం 200 మీటర్లు దూరంలో ఘటనాస్థలం ఉండడం, నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వరదనీటిలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్ఐ మురళీమోహన్ సంఘటనా స్థలం వద్దకు వెళ్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కృష్ణయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి కావడంతో ఎంత వెదికినా కృష్ణయ్యజాడ దొరకలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. శనివారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులు కృష్ణయ్య సాహసాన్ని.. పరోపకార గుణాన్ని తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.