'ధైర్యముంటే లోక్‌సభకు పోటీ చేయండి'
విజయవాడ (గాంధీనగర్) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ధైర్యం ఉంటే రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఎక్కడినుంచైనా పోటీచేసి గెలవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సవాల్ విసిరారు. విజయవాడలో రెండు రోజులపాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను ఆదివారం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు రాష్ట్రంలో బలముందంటున్న వెంకయ్యనాయుడు ఏపీలో తనకిష్టమొచ్చిన ఏ లోక్‌సభ స్థానం నుంచైనా ఎంపీగా గెలిచి చూపించాలన్నారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతిచ్చినా ఆయన గెలవలేడని ఎద్దేశా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను పక్కాగా మోసం చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు అమలుచేయాలని కోరుతూ అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. పార్టీ పిలుపు మేరకు అక్టోబర్ 5న పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాగా ప్రత్యేక హోదాపై జరుగుతున్న మోసాన్ని ప్రజలు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్ది చేపట్టిన దీక్షకు అనుమతి నిరాకరించడం సరికాదని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నిషేధిత ప్రాంతమైన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఢిల్లీలోని ఏపీ భవన్లో దీక్ష చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై అఖిలపక్షం వేయడానికి ఎందుకు జంకుతున్నారో స్పష్టం చేయాలని కోరారు.