100 విమానాలు కొంటున్న స్పైస్‌జెట్
♦ బోయింగ్, ఎయిర్‌బస్‌లతో చర్చలు
♦ విలువ 11 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ : దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికల్లో భాగంగా విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా సుమారు 100 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం విమానాల తయారీ సంస్థలు బోయింగ్, ఎయిర్‌బస్ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ సీఎఫ్‌వో కిరణ్ కోటేశ్వర్ వెల్లడించారు. బొంబార్డియర్, ఏటీఆర్, ఎంబ్రేయర్ లాంటి చిన్న విమానాల కోసం చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఆర్డర్లు ఇచ్చేందుకు 3-6 నెలల సమయం పట్టొచ్చని కోటేశ్వర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన 42 బోయింగ్ మ్యాక్స్ జెట్ల డెలివరీ 2018 నుంచి ప్రారంభం కావొచ్చని ఆయన వివరించారు.
విమానాల కొనుగోలు డీల్ విలువ సుమారు రూ. 70,500 కోట్లు (11 బిలియన్ డాలర్లు) ఉండొచ్చని అంచనా. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన స్పైస్‌జెట్ వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూన్‌తో ముగిసిన క్వార్టర్లో నికర లాభం రూ. 72 కోట్లు. అంతక్రితం ఇదే వ్యవధిలో సంస్థ రూ. 124 కోట్ల నష్టం చవిచూసింది. ప్రస్తుతం సంస్థ వద్ద 34 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. గతేడాది రూ. 26,000 కోట్లు విలువ చేసే 42 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ విమానాలకు ఆర్డరు ఇచ్చింది.