CGF
-
ఏపీ సహజ వ్యవసాయానికి ప్రతిష్టాత్మక అవార్డు
ఏడేళ్ల క్రితం రైతు సాధికార సంస్థ (RySS) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF), పోర్చుగల్‌కు చెందిన ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ 2024 గెలుచుకుంది.పర్యావరణ వ్యవస్థ రక్షణకు దోహదపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి సంవత్సరం ఈ అవార్డు అందిస్తారు. ఈ అవార్డు కింద ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఒక మిలియన్ యూరోల ప్రైజ్ మనీ లభించింది. దీనిని ఏపీసీఎన్ఎఫ్ మాత్రమే కాకుండా సాయిల్ సైంటిస్ట్ రతన్ లాల్, ఈజిప్ట్‌కు చెందిన సెకెమ్ పంచుకున్నారు.మాజీ జర్మన్ ఛాన్సలర్ అండ్ సీజీఎఫ్ జ్యూరీ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఏంజెలా మార్కెల్ అధ్యక్షతన ఉన్న జ్యూరీ 117 దేశాల నుంచి వచ్చిన మొత్తం నామినేషన్లలో ముగ్గురు గ్రహీతలను ఎంపిక చేసింది. ఇందులో ఏపీసీఎన్ఎఫ్ కూడా ఒకటి కావడం విశేషం. -
ఆలయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట
దేవుడి భూమిని లీజుకు తీసుకున్న కౌలుదారుడు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుంటే ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేయాలి. అక్కడి నుంచి అనుమతి పొందాకే చర్యలు చేపట్టాలి. ఈలోపు ఆక్రమణదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే తెచ్చుకుంటే ఇక అది అంతులేని కథే! రూ.వందల కోట్ల విలువ చేసే ఆలయాల స్థలాలతో పాటు అనుబంధంగా ఉండే షాపుల లీజు వ్యవహారం కూడా ఇంతే. రాష్ట్రవ్యాప్తంగా 1,05,364 ఎకరాలు ఆక్రమణదారుల చెరలో చిక్కుకున్నట్లు అంచనా. ఇకపై ఇలాంటి వ్యవహారాలకు తెరదించేలా దేవదాయ శాఖ చట్ట సవరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాక్షి, అమరావతి: దేవుడి భూముల అక్రమణలకు శాశ్వతంగా తెరదించేలా దేవదాయ శాఖ చట్టంలో పలు సవరణలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా దేవుడి భూములను ఖాళీ చేయకుండా అక్రమంగా కొనసాగుతున్న వారికి ఒకే ఒక్క నోటీసు ఇచ్చి వారం రోజుల్లోగా తిరిగి స్వాధీనం చేసుకునేలా దేవదాయ శాఖ చట్టం నిబంధనలు సవరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లు అధికారులు చెప్పారు. ఆర్డినెన్స్ లేదా అసెంబ్లీలో చట్ట సవరణ ప్రక్రియ పూర్తయితే కేవలం నోటీసుల జారీ ద్వారానే 17,839 ఎకరాల దేవుడి భూములను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణదారుల చెరలో దాదాపు 1.05 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా 17,839 ఎకరాలకు సంబంధించి నాలుగైదు ఏళ్ల క్రితమే గడువు ముగిసినా ఖాళీ చేయకుండా పాత లీజుదారులే కొనసాగుతున్నట్లు దేవదాయ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. కోర్టు స్టే లాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆక్రమణదారుల చెరలో ఉన్న ఇలాంటి భూములను కొత్త సవరణ చట్టం ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే వీలుంటుందని అధికారులు వివరించారు. ఆర్టీసీ, రైల్వే లీజుల్లో ఇప్పటికే.. లీజు గడువు ముగిసిన తర్వాత కూడా ఖాళీ చేయకుండా కొనసాగుతుంటే కేవలం అధికారుల స్థాయిలోనే నోటీసులిచ్చి స్వాధీనం చేసుకునే విధానం రైల్వే, ఆర్టీసీలో ఇప్పటికే అమలులో ఉంది. దేవదాయ శాఖ భూములు, స్థలాలు, షాపుల విషయంలో ట్రిబ్యునల్‌ను కూడా సంప్రదించాలన్న నిబంధన కారణంగా అక్రమ అనుభవదారుల సంఖ్య పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీ, రైల్వే తరహాలో నిబంధనలు తేవడం ద్వారా దీన్ని అరికట్టవచ్చని తెలిపాయి. సీజీఎఫ్ నిధులకు ఆదాయ పరిమితి పెంపు! శిధిలావస్థకు చేరుకున్న పురాతన, పాత ఆలయాల పునఃనిర్మాణానికి కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ప్రస్తుతం ఉన్న ఆలయాల గరిష్ట ఆదాయ పరిమితిని పెంచుతూ చట్ట సవరణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
షూటింగ్ లేకుంటే... 2022 కామన్వెల్త్ గేమ్స్‌ను బహిష్కరిద్దాం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022లో జరుగనున్న కామన్వెల్త్ క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తప్పిస్తే... తాము ఏకంగా ఈ మెగా ఈవెంట్‌ను బహిష్కరిస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) హెచ్చరిక జారీ చేసింది. ఈ అంశంపై చర్చించేందుకు సత్వరమే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా శనివారం లేఖ రాశారు. గత నెలలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో రాబోయే కామన్వెల్త్ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించి, మరో మూడు కొత్త క్రీడలను చేర్చాలని కామన్వెల్త్ క్రీడా సమాఖ్య (సీజీఎఫ్) ప్రతిపాదన తెచ్చింది. ఇదే జరిగితే... పతకాల పరంగా భారత్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. పట్టికలోనూ కిందకు పడిపోతుంది. ఈ 2018 గోల్డ్‌కోస్ట్ క్రీడల్లో మన దేశం 66 పతకాలు సాధించగా, అందులో 16 షూటింగ్లో వచ్చినవే. నేపథ్యంలో తమ నిరసనగా సెప్టెంబరులో రువాండాలో జరుగనున్న సీజీఎఫ్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనేది లేదని ఐఓఏ తేల్చిచెప్పింది. సమాఖ్య రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా, స్పోర్ట్స్ కమిటీ సభ్యత్వానికి నామ్‌దేవ్ షిర్గాంకర్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంది. ‘ఇలాంటి అసంబద్ధ ఆలోచనలపై మా నిరసనను తీవ్రంగా వ్యక్తం చేయదల్చుకున్నాం. మేం ఇంకా బ్రిటిష్ పాలనలో లేమని వారు తెలుసుకోవాలి. భారత్ ఏ క్రీడలో పట్టు సాధిస్తే అందులో నిబంధనలు మార్చడమో, మరో అడ్డంకి సృష్టించడమో చేస్తున్నారు. ఈసారి మాత్రం వాటిని ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాం’ అని బాత్రా తెలిపారు. -
ఇద్దరు భారత అథ్లెట్ల బహిష్కరణ
గోల్డ్‌కోస్ట్ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ‘కామన్వెల్త్ గేమ్స్-2018’ లో ముందునుంచి పకడ్బందీగా అమలవుతున్న ‘నో నీడిల్ పాలసీ’ (సిరంజీల వాడకం నిషేదం)ని ఉల్లంఘించారనే కారణంగా ఇద్దరు భారత అథ్లెట్లు బహిష్కరణకు గురయ్యారు. ఏవీ రాకేష్ బాబు, ఇర్ఫాన్ కొలొత్తమ్ థోడిల పైన కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ (సీజీఎఫ్) నిషేదం విధించింది. ఈ ఇద్దరూ క్రీడా గ్రామం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న విక్రం సిసోడియా, జట్టు మేనేజర్ నామ్‌దేవ్ శిర్గావంకర్, అథ్లెటిక్స్ మేనేజర్ రవీందర్ చౌదరీలపై కూడా సీజీఎఫ్ మండిపడింది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని సీజీఎఫ్ ప్రెసిడెంట్ లూయిస్ మార్టిన్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని బహిష్కరణకు గురైన భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం వీరు ఉల్లంఘించారని సీజీఎఫ్ తెలిపింది. ఒకవేళ డయాబెటిస్‌లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే.. ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించింది. భారత ఆటగాళ్ల గదుల వద్ద వాడి పడేసిన సిరంజీలు బయటపడినపుడు తొలుత పెద్దగా పట్టించుకోని సీజీఎఫ్ కోర్టు.. ఈ విషయంపై పునర్విచారణచేపట్టి చర్యలు తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ నుంచి బహిష్కరణకు గురైన రాకేష్ బాబు ట్రిపుల్ జంప్‌లో, ఇర్ఫాన్ రేస్ వాక్‌లో పాల్గొనాల్సి ఉంది. -
వాటా చెల్లింపులపై వివరణ ఇవ్వండి
• తెలంగాణ, ఏపీలకు హైకోర్టు ఆదేశం • సీజీఎఫ్, ఈఏఎఫ్ వాటాల అంశంలో • సౌందరరాజన్ పిల్‌పై స్పందన సాక్షి, హైదరాబాద్: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్), ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ (ఈఏఎఫ్)లకు టీటీడీ సహా ఇతర దేవస్థానాలు చెల్లించాల్సిన వాటాలపై చిలుకూరు బాలాజీ దేవస్థానం ధర్మకర్త ఎంవీ సౌందరరాజన్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. 2003 నుంచి 2013 వరకు టీటీడీ సహా ఇతర పెద్ద దేవాలయాలు సీజీఎఫ్, ఈఏఎఫ్‌లకు దాదాపు రూ.1,000 కోట్ల వరకు వాటా చెల్లించాల్సి ఉందని, వీటి వసూలుపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని సౌందరరాజన్ హైకోర్టులో గత నెల 13న పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం హైకోర్టు ధర్మాసనం ముందుకొచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. దేవాలయాల్లోని అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల్లో 27 వేల దేవాలయాలు మూతపడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో 2007లో దేవాదాయ చట్టానికి సవరణలు తెచ్చి, పెద్ద దేవస్థానాల ఆదాయంలో 7% లేదా రూ.50 లక్షలను సీజీఎఫ్, ఈఏఎఫ్‌లకు జమ చేయాలంటూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అర్చకులు, సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. ఇలా టీటీడీ నుంచి దాదాపు 700 కోట్లు, మిగిలిన పెద్ద దేవాలయాల నుంచి రూ.280 కోట్లకు పైగా రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు ఇందులో తెలంగాణలోని దేవాలయాలకు కూడా వాటా ఉందని, ఆ మేర సొమ్ము చెల్లించేలా ఆదేశించాలని కోరారు.