ప్రభుత్వాసుపత్రుల కోసం స్థలాలు పరిశీలించిన లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల స్థాయిలో నగరంలో మరో రెండు ప్రభుత్వాసుపత్రులను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ పనిలో పడ్డారు. శ నివారం వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడారు. సమావేశం అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న స్థలాలను, పాత భవనాలను మంత్రి పరిశీలించారు.
గచ్చిబౌలి స్టేడియం పక్కన ఉన్న 14 అంతస్తుల పాత భవనాన్ని పరిశీలించారు. వెయ్యి పడకలతో రెండు పెద్ద ఆసుపత్రులు, లేదా 500 పడకలతో హైదరాబాద్‌కు నలు దిక్కులా నాలుగు ఆసుపత్రులు నిర్మించాలని సర్కారు యోచిస్తోంది. ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గచ్చిబౌలి, కూకట్పల్లి ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కింగ్‌కోఠి ఆసుపత్రిని స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారం ఉదయం కూడా ఎల్బీనగర్ ప్రాంతంలో ఉండే ఖాళీ స్థలాలను మంత్రి పరిశీలిస్తారు.