కక్షలొద్దు.. ప్రగతే ముద్దు
కప్పట్రాళ్ల(దేవనకొండ) : కక్షలకు స్వస్తి పలికి అభివృద్ధి పథంలో నడవాలని కప్పట్రాళ్ల గ్రామస్తులకు కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్, ఎస్పీ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఈ గ్రామాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణ దత్తత తీసుకున్న విషయం విదితమే. గ్రామంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారుల దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన వారు బుధవారం గ్రామంలో పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. జెడ్పీ నిధులు రూ.48.40 లక్షలతో అదనపు తరగతి గదులకు కలెక్టర్ భూమిపూజ చేశారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజు ఆధ్వర్యంలో జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడారు. కప్పట్రాళ్లలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా అణచివేసేందుకు ఎస్పీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. గ్రామస్తులు కూడా కక్షలకు దూరంగా ఉంటూ అభివృద్ధికి సహకరించాలన్నారు. త్వరలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సహకారంతో దేవనకొండ మండలంలో హంద్రీనీవా పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో వాటర్‌షెడ్ పనులు చేపట్టేందుకు రూ.2.30 కోట్లు నిధులు ఉన్నప్పటికీ రూ.13 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
ఈ నిధులో నాలుగు నెలల్లోపు పాంపాండ్స్ ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచుతామన్నారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు అవసరమైన నిధులను కేటాయిస్తామనపి హామీనిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతుండగా పాఠశాల విద్యార్థులు తమకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్.. కర్నూలు నుంచి బోర్వెల్ను తెప్పించి పాఠశాల ఆవరణలో బోరును వేయించారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణానికి జెడ్పీ నిధులను కేటాయించి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. ఇక నుంచి గ్రామ ప్రజలు గతాన్ని పూర్తిగా వదిలి వేయాలని సూచించారు. కొత్త జీవితంలోకి మారాలని కోరారు. గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ, జిల్లాలోనే ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దేందుకు తనకు సహకరించాలన్నారు. గతంలో కక్షలకు బలైన కుటుంబాల దీనగాథను, అలాగే ఇటీవల కక్షల్లో కూరుకుపోయి జైలుపాలైన వారి కుటుంబాలను పరామర్శించానన్నారు. అప్పుడు తనకు చాలా బాధను కలిగిందన్నారు.
అందుకే కప్పట్రాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చానన్నారు. ప్రతి ఒక్కరూ శాంతిస్థాపనే లక్ష్యంగా ముందడుగు వేయాలని కోరారు. గ్రామంలో ప్రతి వీధిలో మొక్కలను నాటుకోవాలన్నారు. గ్రామంలో లక్ష మొక్కలు నాటడడమే లక్ష్యంగా ప్రజలు ముందుకు రావాలని కోరారు. పిల్లలను బాగా చదివించాలన్నారు. అలాగే బాగా చదివి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కేఈ ప్రతాప్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ.. పేదరికం, నిరక్షరాస్యత కారణంగా కప్పట్రాళ్ల గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా కక్షల్లో చిక్కుకొని పోయారన్నారు.
ఎన్నో కుటుంబాలు ఫ్యాక్షన్ కక్షలకు బలయ్యాయయన్నారు. అలాంటి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఎస్పీ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గదన్నారు. జిల్లా వైద్యాధికారిణి నిరుపమ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, ఆర్వీఎం ఈఈ ప్రతాప్‌రెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేస్, అడిషనల్ ఎస్పీ బాబురావు, డోన్ డీఎస్పీ పి.ఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటాసుబ్బారావు, ఎస్ఐ మోహన్కిశోర్, తహశీల్దార్ వెంకటశివరామయ్య, వాటర్‌షెడ్ ప్రాజెక్టు ఆఫీసర్లు మిథున్చక్రవర్తి, మధుసూదన్, ఏపీఎం వీరన్న, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి జెడ్పీటీసీ సభ్యురాలు బొజ్జమ్మ, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యురాలు భర్త ఉచ్చీరప్ప, గ్రామ ఉప సర్పంచ్ రాముడుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.