మూడేళ్లలో పూర్తి ఆయకట్టుకు ‘చాగల్నాడు’ నీరు
కాతేరు (రాజమహేంద్రవరం రూరల్):
చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా మూడేళ్లలో పూర్తి ఆయకట్టుకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అనపర్తి, రాజమహేంద్రవరంరూరల్, రాజానగరం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్ పేర్కొన్నారు. వారు ముగ్గురూ సోమవారం కాతేరు గ్రామంలోని చాగల్నాడు ఎత్తిపోతల పథకం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ పథకంలో 35వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా ప్రస్తుతం 15 వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పైపులైన్లు అన్నీ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.ఏడు కోట్లతో పంపులను బాగు చేయిస్తామన్నారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్వహణ కోసం రూ.1.8 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్టు వారు తెలిపారు. గోదావరిలో కొవ్వూరు వైపు వాలు ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ నాలుగుఎత్తిపోతల పథకాలకు నీరందే పరిస్థితి లేదని తెలిపారు. గోదావరిలో డ్రెడ్జింగ్ పనులు చేపడితే నీటి సమస్య ఉండదన్నారు. మేం ముగ్గురం కలసి ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి డ్రెడ్జింగ్ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు నల్లమిల్లి, గోరంట్ల, పెందుర్తి తెలిపారు. జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సరిసపల్లి నాగేశ్వరరావు, రంగంపేట ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు, జగ్గంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల వెంకట్రావు, సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకరరావు, డీఈ యు.రమేష్, డీఈ(వైఆర్సీ,పెద్దాపురం) కె.శ్రీనివాస్, ఏఈ జగదీష్ పాల్గొన్నారు.