ఒంటరి పోరాటమే సారికను బలిగొందా?
మహిళల మీద దాడులు నిత్యం జరుగుతున్న సందర్భంలో కొన్ని దారుణాలు మినహాయింపు లేకుండా అందరినీ కదిలించేవిగా, నేరస్థులకు కూడా అదే శిక్ష వేయాలనేంత తీవ్రంగా ఉంటాయి. ఇటీవల మాజీ పార్లమెంట్ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యురాలైన సారిక ఆమె ముగ్గురు పిల్లల దారుణ మరణంపై కూడా సభ్య సమాజం ఇంతే తీవ్రంగా స్పందించింది. పురుషుడు తన భార్యను, పిల్లలను బానిసల వలే కొట్టడం, తిట్టడ ం, చంపేయడం వంటి అధికారాలను మన వ్యవస్థే దఖలు పరిచింది. ఈ వర్గనీతి అటు అగ్రకులాల్లో, ఇటు వెనుకబడిన కులాల్లో కూడా నేటికీ కొనసాగుతోందని సారిక ఉదంతం చాటి చెబుతోంది.
ఉన్నత చదువులు చదివిన సారిక తన కుటుంబ సభ్యులను ఎదిరించి రాజయ్య కుమారుడిని 2002లో కులాంతర వివాహం చేసుకుంది. కానీ కుటుంబ హింసను భరించలేక 2009 నుంచి న్యాయపోరాటం చేస్తూవచ్చింది. ఆమెది సున్నిత మనస్తత్వం. చావైనా, బతుకైనా భర్త కుటుంబంతోటే అనే భూస్వామ్య భావజాలం గల మనస్తత్వం. చాలా మంది మహిళల వలే కాకుండా మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్తను ఎదిరించింది. 498ఏ కేసు ద్వారా న్యాయం దొరుకుతుందని ఆశించింది. కోర్టును నమ్ముకుని అత్తింట్లో పెట్టే హింసను మౌనంగా భరిస్తూ వచ్చింది. అత్తింట్లో తనకు, పిల్లలకు కనీసం ఆస్తి హక్కయినా దక్కుతుందని పోరాటం చేస్తే చివరికి జీవించే హక్కునే హరించి వేశారు. అరుపులు కూడా లేకుండా నలుగురూ మంటలకు ఆహుతైపోయారు.
సారిక మరణం ముమ్మాటికీ హత్యేనని మహిళలు నినదిస్తూ, ఏకపక్ష విచారణ జరుగుతున్నదని అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు అనుమానించి నట్లే సారికది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంకోవైపు సమస్యను పక్కదారి పట్టించడానికి సైకియాట్రిస్టు చేత ఆత్మహత్య చేసుకునే వ్యక్తుల స్వభావాలపై చర్చ లేవదీస్తూ, పిల్లలను చంపిన నేరస్థురాలిగా సారికను చిత్రీకరిస్తున్నారు. కోర్టు సాక్ష్యాల మీదే ఆధారపడకుండా సారిక కుటుంబ సభ్యుల చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి. ఫోరెన్సిక్ రిపోర్టు, పోలీసు విచారణలన్నీ దీనిని ఆత్మహత్యగా నివేదించినా ఈ ఘటనను హత్యగా భావిస్తేనే సారిక కేసుకు న్యాయం జరుగుతుంది.
వాస్తవానికి బీటెక్ చదివిన సారికకు ఈ వ్యవస్థను రాజ్యస్వభావాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు.
సారిక దళితుడిని వివాహమాడటంతో తల్లి దండ్రుల పూర్తి మద్దతు లేక అత్తింట్లో కూడా వెలివేయబడి ఒంటరి పోరాటం చేసింది. సరైన మార్గదర్శకులు ఎదురై ఉంటే ఆమె ఒంటరి పోరాటం సంఘటిత పోరాటంగా రూపుదిద్దుకునేది. తన కుటుంబం కూడా పితృస్వామ్య రాజ్య వ్యవస్థలో భాగమనే జ్ఞానాన్ని పొందేది. సంఘటిత పోరాటం ద్వారా ప్రచారం చేస్తేనే తనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతానని ఆమె గ్రహించలేక పోయింది. ఆమె కుటుంబానికి శిక్ష పడకుంటే ప్రభుత్వం తన వర్గ స్వభావాన్ని నిరూపించుకున్నట్లే. కాబట్టి సారికకు న్యాయం చేయవలసిందిగా ప్రజలే ప్రభుత్వంపై సంఘటిత పోరాటం చేయాలి
అనిత రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, చైతన్య మహిళా సంఘం