సింగపూర్ పెట్టుబడుల పేరుతో మోసం
సింగపూర్ కంపెనీల నుంచి భారీగా పెట్టుబడులు ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ కంపెనీ ఎండీకి టోకరా వేసి పరారైన వ్యక్తిపై జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-25లోని ప్లాట్ నంబర్ 296లో చించోలి షుగర్ అండ్ బయో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ కొనసాగుతోంది. ఈ కంపెనీ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగానే డాక్టర్ ఎస్. చల్లకుమార్ అనేవ్యక్తి ఈ కంపెనీ ఎండీ తోట సుబ్బారాయుడుకు పరిచయం అయ్యాడు. తనకున్న పరిచయాలతో సింగపూర్ నుంచి భారీగా పెట్టుబడులు తెప్పిస్తానంటూ నమ్మించాడు.
ఈ నేపథ్యంలోనే కంపెనీకి చెందిన ఇన్నోవా వాహనంలో హైదరాబాద్‌లో పని ఉందంటూ డ్రైవర్ రేణుకేశ్వర్రావుతో కలిసి తిరిగాడు. అదే రోజు విజయవాడలో కూడా కొంత మందిని కలవాల్సి ఉందంటూ ఇన్నోవాలో వెళ్లాడు. అక్కడ మురళి ఫార్చున్ హోటల్‌కు వెళ్లి డ్రైవర్‌ను బయట కూర్చోమని చెప్పి ఇప్పుడే వస్తానని ఇన్నోవాలో వెళ్లిపోయి తిరిగి రాలేదు. దీంతో డ్రైవర్ రేణుకేశ్వర్రావు విషయాన్ని కంపెనీ ఎండీకి తెలిపాడు. కారులో రూ.1.20 లక్షల నగదుతో పాటు రూ.5 లక్షల బంగారు గడియారం, విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని.. కారుతో ఉడాయించిన చల్ల కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ కంపెనీ లీగల్ హెడ్ సిలివేరి శ్రీశైలం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చల్ల కుమార్‌తో పాటు అతడిని తమకు పరిచయం చేసిన వేణు అనే వ్యక్తిపై జూబ్లీహిల్స్‌పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 420, 379, 406 కింద కేసు నమోదైంది. వీరి కోసం గాలింపు చేపట్టారు.