హౌసింగ్‌లో రూ.50 కోట్ల కుంభకోణం
కరీంనగర్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం మండలాల్లో గృహనిర్మాణ పథకంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన కాటారం జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి జెడ్పీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొప్పాపూర్‌లో 600 రేషన్‌కార్డులుంటే, 750 ఇండ్లు మంజూరయ్యాయంటూ అవినీతికి ఆధారాలను బయటపెట్టారు.
దీనిపై మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా హౌసింగ్, పింఛన్లలో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపిస్తామన్నారు. బ్రోకర్లు, పైరవీదారుల కోసం తమ ప్రభుత్వం లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం పోయిందని, ఆ నమ్మకాన్ని తిరిగి నెలకొల్పేందుకే ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. జిల్లాలోని ప్రాధాన్యతా అంశాలను ప్రణాళికలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రా అధికారి వెళ్లిపోవాలి : బొడిగె శోభ
ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ తన సొంత ప్రాంతానికి వెళ్లిపోవాలని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ అల్టిమేటం జారీ చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కింద పనులు మంజూరైనా, అధికారులు పనులు చేపట్టడం లేదన్నారు. పనులు చేయకపోవడానికి ఈఈ లేడని ఎస్ఈ సాకు చూపిస్తున్నాడన్నారు. ఆంధ్రాకు చెందిన ఆ అధికారికి తెలంగాణలో పనిచేయడం ఇష్టం లేకపోతే సొంత ప్రాంతానికి వెళ్లొచ్చన్నారు.