ఫైనల్లో ఢిల్లీ
ఇండోర్: చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్రికెటర్లు స్ఫూర్తిదాయక ఆటతీరుతో అదరగొట్టారు. ఇండియా రెడ్ జట్టును 112 పరుగుల తేడాతో చిత్తు చేసి చాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్నారు. హోల్కర్ స్టేడియంలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెడ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు సాధించింది.
యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ (131 బంతుల్లో 119; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (55 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మిలింద్ కుమార్ (52 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీలతో రాణించారు. గంభీర్ (20), సెహ్వాగ్ (8) విఫలమయ్యారు. చివర్లో రజత్ భాటియా (19 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. రెడ్ బౌలర్లలో మిథున్‌కు మూడు వికెట్లు దక్కాయి.
ఇండియా రెడ్ జట్టు 40.1 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటయింది. ఓపెనర్ ముకుంద్ (87 బంతుల్లో 64; 5 ఫోర్లు), గుర్కీరత్ సింగ్ (51 బంతుల్లో 83; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే మెరుగ్గా రాణించారు. కెప్టెన్ యూసుఫ్ పఠాన్(0), ఉతప్ప (7) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో వరుణ్ సూద్ ఐదు, ఆశిష్ నెహ్రా నాలుగు వికెట్లు తీసుకున్నారు.