వాణిజ్య కేంద్రంగా ఖమ్మం
ఖమ్మం గాంధీచౌక్: బ్రిటీష్ కాలం నాటి చట్టాలతో వివిధ వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆయా చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.సోమవారం రాత్రి స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగిన చాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాల వజ్రోత్సవ వేడుకల ముగింపు సభలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొందని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. వ్యాపారులు సంతోషంగా ఉంటే రైతులు సంతోషంగా ఉంటారని, వారి ద్వారా కూలీలు తద్వారా ప్రభుత్వం ఆనందంగా ఉంటుందని అన్నారు. గుజరాత్, పంజాబు రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో, వ్యాపార, వ్యవసాయ రంగాలలో ముందంజలో ఉండే విధంగా కృషి జరుగుతుందన్నారు. జిల్లాలో ఖమ్మన్ని వాణిజ్య కేంద్రంగా గుర్తింపును తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తుమ్మల అన్నారు.
కొత్తగూడెం, ఇల్లెందు వంటి పట్టణాలు పారిశ్రామికంగా, సింగరేణి కేంద్రాలకు బాసిల్లుతున్నాయని, ఖమ్మం వాణిజ్య కేంద్రంగా మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. ఖమ్మం నగరానికి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందే అన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్దికి మరో రూ.500 కోట్లు వెచ్చిచనున్నామని తెలిపారు. ఖమ్మాన్ని అనుసందానం చేస్తూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని అన్నారు. విద్య, వ్యవసాయం, సాంస్కతిక రంగాలతో పాటు అన్ని రంగాల్లో ఖమ్మాన్ని రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపి గుర్తింపు తీసుకువచ్చేందు కృషి చేస్తానన్నారు.
మనిషి విశాలంగా ఎదగాలని సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో అందరూ బాగస్వాములు కావాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ, ఇతర రంగాలకు మాదిరిగా పరిశ్రమలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శివకుమార్ గుప్తాఅన్నారు. పన్నుల విధానంలో అనేక ఇబ్బందులను వ్యాపారులు ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రిని కలిసి విన్నవించామన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన సభలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, మాజీ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పు నరేష్ కుమార్, మెంతుల శ్రీశైలం తదితరులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గుడవర్తి శ్రీనివాస రావు, సహాయ కార్యదర్శి చింతల రామలింగేశ్వరరావు, కోశాధికారులు కురువెల్ల ప్రవీణ్ కుమార్, తూములూరి లక్ష్మీ నర్సింహారావు, రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యులు అశోక్, 19 శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వర్తక సంఘం భవన ఆవరణలో మంత్రి ప్రతిష్టించారు. ‘వాణిజ్య వాణి’ సావనీరును ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి.