గరీబోళ్ల బిడ్డ ‘టాప్’ లేపాడు
హైదరాబాద్: టెన్త్ ఫలితాల్లో చంపాపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థి పృథ్వీరాజ్ 10/10కి సాధించాడు. గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 సాధించింది పృధ్వీరాజ్ ఒక్కడే. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడు గ్రామానికి చెందిన యాదయ్య ఉపాధి కోసం నగరానికి వలస వచ్చి చంపాపేట హరిజన బస్తీలో ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఆయన భార్య గంగమ్మ టైలరింగ్ చేస్తూ కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంది. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు పృథ్వీరాజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. సెలవుల్లో పృథ్వీ కూడా కూలీ పనులకు వెళుతూ తల్లిదండ్రులకు సాయంగా ఉంటున్నాడు. ఐఐటీల్లో చదవాలన్నది తన కోరిక అని పృథ్వీ ‘సాక్షి’కి చెప్పాడు.