మన్యసీమకు ప్రత్యేక మండలి : చందా లింగయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని మన్యసీమ రాష్ట్ర సాధన సమితి కన్వీనర్ చందా లింగయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, మన్యసీమకు స్వయం పరిపాలన కోసం డిమాండ్ చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వనరులు పుష్కలంగా ఉన్న దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించాలని కోరారు. ఆదివాసీ డిమాండ్లపై జీవోఎంను కలిసి వినతిపత్రాన్ని అందచేసినట్టు చెప్పారు.
శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు గిరిజన, ఆదివాసీ ప్రాంతాలను కలిపి మన్యసీమ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోకపోవడం ఆదివాసీ వ్యతిరేక చర్యలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరంపై శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పట్టించుకోలేదన్నారు. ఆదివాసీల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.