వాహనాల్లోంచి దూకేసి ప్రాణాలు అరచేతపట్టుకొని..
మనాలి: భారీ కొండల మధ్యన వేగంగా దూసుకెళుతున్న వాహనాలు.. రహదారి గుండా ఆహ్లాదాన్నిచ్చే వనాలు.. రోడ్డుపక్కన మెల్లగా శబ్దం చేస్తూ పారుతున్న నది. సడెన్‌గా ఓ కారు ఆగిపోయింది.. దాని వెనుక బస్సు, లారీ, బైక్ ఇలా కనుచూపమేరలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా ఎవరో బలంగా లాగేసినట్లుగా సడెన్‌గా నిలిచిపోయాయి. ఇరు పక్కల వాహనాలు డోర్లు గబాగబా తీసుకొని ప్రాణభయంతో అరుపులతో నిండిన పరుగులు.. ఇదంతా కూడా సోమవారం మధ్యాహ్నాం 2గంటల ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-చండిగఢ్ రోడ్డు మీద కనిపించిన దృశ్యం.
అనూహ్యంగా భారీ మొత్తం కొండచరియలు విరిగిపడటం ప్రారంభంకావడంతో వాహనాల్లో ఉన్నవారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఒక్కసారి భారీ స్ధాయిలో మట్టిపెద్దపెద్ద బండరాళ్లు పెద్దపెద్ద చప్పుళ్లు చేస్తూ రహదారి మీద నుంచి నదిలోకి పడటంతో నదిలోని నీళ్లు ఎగిసి రోడ్డుమీదపడ్డాయి. దీంతో వచ్చిపోయే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, తజకిస్థాన్‌లో ఏర్పడిన భూకంపం మూలంగా ఈ ఘటన చోటుచేసుకుందా అని ఆలోచిస్తున్నారు.