టీమిండియా చేతిలో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌పై వేటు
టీమిండియా చేతిలో ఘోర ఓటముల నేపథ్యంలో బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురుసింఘేపై వేటు పడింది. హతురుసింఘే తక్షణమే హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆదేశించింది. హతురుసింఘే స్థానంలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఫిల్ సిమన్స్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. సిమన్స్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడు. శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ అయిన హతురుసింఘే రెండు సార్లు బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2014-17 మధ్యలో తొలిసారి.. 2023 జనవరి-2024 అక్టోబర్ మధ్యలో రెండోసారి బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా పని చేశాడు. కొత్త కోచ్ సిమన్స్ త్వరలో జరుగబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడు.కాగా, బంగ్లాదేశ్ తాజాగా భారత్‌తో ఆడిన టెస్ట్, టీ20 సిరీస్‌లలో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. ఈ రెండు సిరీస్‌లలో బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ అయ్యింది. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో ఓడిన బంగ్లా జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-3 తేడాతో పరాజయం పాలైంది. దీనికి ముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్‌పై టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. బంగ్లా టైగర్స్ పాక్‌ను వారి సొంతగడ్డపై రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడాతో మట్టికరిపించారు. పాక్‌పై విజయంతో భారీ అంచనాలతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ రెండు సిరీస్‌ల్లో తేలిపోయింది. ఈ నెల 21 నుంచి సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ అక్టోబర్ 21న ఢాకా వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ చట్టోగ్రామ్ వేదికగా అక్టోబర్ 29న ప్రారంభంకానుంది. చదవండి: సంపన్న క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లిని అధిగమించిన అజయ్ జడేజా