హరహర మహదేవ శంభోశంకర
- నేత్రపర్వంగా సాగిన చంద్రమౌళీశ్వర బ్రహ్మరథోత్సవం
- భక్తులతో పోటెత్తిన గవిమఠ సంస్థానం
ఉరవకొండ : హరహర మహదేవ శంభోశంకర అనే నామస్మరణతో గవిమఠ సంస్థానం మార్మోగింది. గవిమఠ స్థిత చంద్రమౌళీశ్వర బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు మంగళవారం నేత్రపర్వంగా సాగాయి. వేడుకలు తిలకించడానికి ఆంధ్ర, కర్ణాటక నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో గవిమఠ సంస్థానం కిటకిటలాడింది. ఉదయం సంప్రదాయబద్ధంగా మేజర్ పంచాయతీ వారు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించిన భారీ గజమాలను రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్టు అధినేత నర్రాకేశన్న అధ్వర్యంలో ఊరేగింపుగా గవిమఠానికి సమర్పించారు. అనంతరం గవిమఠం పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి వారి అధ్వర్యంలో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా రథం వద్దకు తీసుకొచ్చారు.
తర్వాత భక్తులు హరహర మహదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగారు. ఉరవకొండ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శాయికుమారి, గవిమఠం సహాయ కమిషనర్ ఆనంద్, ఈఓ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ రాజశేఖర్, ఆర్ఐ లింగేష్, మాజీ ఎమ్మెల్సీ విప్ వై.శివరామిరెడ్డి సతీమణి ఉమాదేవితో పాటు జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ కొత్తలక్ష్మిదేవి, ఎంపీటీసీ సభ్యులు విజయ్, రవి, మాలింగ, ఎర్రిస్వామి పాల్గొన్నారు.