చాపరాయి మృతులు గుర్తుకురాలేదా?
స్పీకర్ కోడెలకు ఎమ్మెల్యే వంతల సూటిప్రశ్న
ప్రభుత్వ చర్యల వల్లే గిరిజనులకు ఈ దుస్థితి అని ఆగ్రహం
రంపచోడవరం :
ఏజెన్సీ పర్యటనకు వచ్చిన శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు చాపరాయిలో జ్వరాలతో చనిపోయిన గిరిజన కుటుంబాలను ఆ గ్రామానికి వెళ్లి కనీసం పలకరించాలని అనిపించలేదా అని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విలేకరులకు ఆమె ఈ మేరకు ఒక ప్రకటన అందజేశారు. జ్వరాలతో గిరిజనులు చనిపోతుంటే మూఢ నమ్మకాల వల్ల చనిపోయారని అంటారా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వం గిరిజనుల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు అందని దయనీయ పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని ఆరోపించారు. ఏజెన్సీలో గిరిజనుల మరణాలు సీఎంకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కనీసం సీఎం ఇప్పటి వరకు రంపచోవరం ఏజెన్సీకి రాలేదంటే మీ ప్రభుత్వం తీరు ఏ పరిస్థితిలో ఉందో అర్ధమవుతోందన్నారు. ప్రభుత్వం తీరును గిరిజనులు గమనిస్తున్నారని, వారు మూఢ నమ్మకాల్లో లేరని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులను చిన్న చూపు చూస్తే సహించేది లేదన్నారు. ఏజెన్సీలో వైద్య సేవలు అందక గిరిజనులు చనిపోతుంటే ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదన్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మందులు సరిగా అందుబాటులో లేవన్నారు. మీరు చేసే తప్పులకు గిరిజనులు బలవుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో తక్షణం వైద్య శిబిరాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు.