భద్రాద్రి ఆలయంలో పాలనా సంస్కరణలు
- శాఖాపరమైన మార్పులకు ఇన్చార్జ్ ఈఓ సూచనలు
- ఉద్యోగుల ఐక్యతతోనే అభివృద్ధి
- దేవస్థానంపై దేవాదాయశాఖ అధికారుల పెత్తనం..?
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఇన్చార్జ్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన దేవాదాయశాఖ వరంగల్ డెప్యూటీ కమిషనర్ టి. రమేష్‌బాబు పాలనాపరమైన వ్యవహారాలపై దృష్టి సారించారు. వారం రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆయన వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు. గత ఈవో వద్ద స్వామివారి వెండి, బంగారం నిల్వలను సరిచూసుకున్నారు.
రామాలయంలోని పాలనాపరమైన విభాగాలన్నింటీన పరిశీలించారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. రిజిస్టర్ల నిర్వహణను పరిశీలించారు. హాజరుపట్టికలను సరిగా నిర్వహించి తనకు అందజేయాలని ఆదేశించారు. భద్రాచలానికి వచ్చిపోయే భక్తులకు వసతి సౌకర్యాన్ని కల్పించే తానీషా మండపంలో ఉన్న సీఆర్వో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రోజువారీగా ఖాళీ అయ్యే గదులు, సత్రాలు, కాటేజీల వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలని సూచించారు.
రామయ్య స్వామిని దర్శించుకునే ఉచిత క్యూలైన్ల వద్ద స్వామివారి నామాలు పెట్టేందుకు ప్రత్యేక అర్చకున్ని నియమిస్తామన్నారు. అక్కడ ఆలయానికి సంబంధించిన అర్చకుడు కాకుండా బయటి వ్యక్తులు భక్తుల నుంచి డబ్బులు తీసుకొని నామాలు పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు.
దేవస్థానంపై దేవాదాయశాఖ అధికారులు పెత్తనం పెరుగుతుందని పలువురంటున్నారు. భద్రాచలం దేవస్థానానికి ఇప్పటి వరకు ఆర్జేసీ కేడర్ అధికారులు ఈవోలుగా రావడంతో ఇప్పటి వరకు దేవాదాయశాఖకు చెందిన అధికారులకు అంతగా ప్రాధాన్యం లభించేది కాదు. దీనిపై గతంలో దేవాదాయశాఖ ఉద్యోగులు, అధికారులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత దేవాదాయశాఖకు చెందిన డెప్యూటీ కమిషనర్‌కే దేవస్థాన ఈవో బాధ్యతలు అప్పగించడంతో దేవాదాయశాఖ పెత్తనం పెరగవచ్చనే అభిప్రాయం వెలువడుతోంది.
దేవస్థానం ఉద్యోగులు, అర్చకులు, వేదపండితులు ఐక్యంగా ఉంటేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని ఇన్చార్జి ఈఓ రమేశ్‌బాబు అన్నారు. రామాలయంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందన్న విషయం వాస్తవమేనన్నారు. దాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఉద్యోగులను నొప్పించాలన్నది తన అభిమతం కాదన్నారు. అందరూ తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తేనే అభివృద్ధి చెందిన రామాలయాన్ని చూడవచ్చన్నారు. అభివృద్ధికి ఆలయ అర్చకులు, అధికారులు సహకరించాల్సిందిగా కోరారు.