ఏదీ రథసారథి..
► రథసారథిలేని జిల్లా విద్యాశాఖ
► పరిహాసంగా మారిన ఇన్చార్జి బాధ్యతలు
ఆరిలోవ: జిల్లా విద్యాశాఖ రథసారధి నియామకంలో ఉన్నతాధికారులు దోబూచులాడుతున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా పని చేసిన వెంకటకృష్ణారెడ్డి ఆర్జేడీగా పదోన్నతిపై వెళ్లిపోయిన తర్వాత ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటి నుంచి ఎవరినీ డీఈవోగా నియమించలేదు. ఇన్చార్జి బాధ్యతలు డిప్యూటీ డీఈవోకు రేణుకకు అప్పగించారు. ఆమె ఆ బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడవకముందే ఉన్నతాధికారులు అర్బన్ డిప్యూటీ డీఈవో జి.నాగమణికి ఆ బాధ్యతలను కట్టబెట్టారు. దీంతో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అధికారులు మారినట్టయింది.
సౌకర్యాలు సమకూరినా..
రూరల్ తహసీల్దారు కార్యాలయం పక్కన జాతీయ రహదారిని ఆనుకొని ఇటీవల నూతన డీఈఓ కార్యాలయం నిర్మించారు. దీని నిర్మాణం పనులు దగ్గరుండి చేపట్టిన అప్పటి డీఈఓ వెంకటకృష్ణారెడ్డి ఇక్కడ కుర్చీలో కూర్చోకుండానే పదోన్నతిపై ఫిబ్రవరిలో ఆర్జేడీగా రాజధానికి వెళ్లిపోయారు. దీంతో నూతన భవనంలో ఈ కుర్చీ ఖాళీ అయిపోయింది. ఇన్చార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆలోచనలో పడ్డారు. డిప్యూటీ డీఈఓలుగా పనిచేస్తున్న సీవీ రేణుక, జి.నాగమణిలలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలో సరిగా తేల్చుకోలేకపోయారు.
అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేసిన నాగమణికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు వెంకటకృష్ణారెడ్డి రిలీవ్ కాబోయే ముందు రోజు ప్రకటించారు. రెండో రోజు ఆమె బాధ్యతలు స్వీకరిస్తారనుకొనే సమయంలో అదే రోజు అర్ధరాత్రి మళ్లీ ఉత్తర్వులు మారిపోయాయి. ఇన్చార్జ్ బాధ్యతలు రూరల్ పరిధిలో డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్న సీవి రేణుకకు అప్పగించినట్లు ఉత్తర్వులు డీఈఓ కార్యాలయానికి పంపించారు. దీంతో రేణుక ఫిబ్రవరి 13న బాధ్యతలు తీసుకున్నారు. రేణుక తన సీనియారిటీని చూపించి ఉన్నతాధికారుల నుంచి రాత్రికి రాత్రే ఆర్డర్ తెప్పించుకోగలిగారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అర్బన్ డిప్యూటీ డీఈఓగా పనిచేస్తున్నాను.. నాకూ సీనియారిటీ ఉంది.
ఆ బాధ్యతలు నాకే అప్పగించాలని కోరుతూ నాగమణి విద్యాశాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. దీంతో పాటు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దీన్ని పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు ఆమె విన్నపాన్ని పునఃపరిశీలించి శుక్రవారం రాత్రి నాగమణికి పూర్తి ఇన్చార్జి (ఎఫ్ఐసీ) బాధ్యతలు అప్పగించి, రేణుకకు మళ్లీ డిప్యూటీ డీఈఓగా రూరల్ బాధ్యతలు చూడాలని ఉత్తర్వులిచ్చారు. దీంతో శనివారం రేణుక.. నాగమణికి బాధ్యతలు అప్పగించారు. కాగా.. డీఈఓ భవనంలో కుర్చీ కోసం ఇంకెన్ని ఆటలు చూడాల్సి వస్తుందో, ఎవరు పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరిస్తారోనని సిబ్బంది నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.