చవితి చంద్రుడు రాలేదు!!
భాద్రపద శుద్ధ చవితి.. అంటే వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవని, ఏదో ఒక అపనింద భరించాల్సి ఉంటుందని అంటారు. అయితే, శుక్రవారం నాడు దాదాపుగా రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు పట్టి కుండపోతగా వర్షం కురవడంతో అసలు చవితి చంద్రుడే కనిపించలేదు! ఉమ్మడి రాజధాని నగరమైన హైదరాబాద్లో అయితే సాయంత్రం నుంచి మబ్బు బాగా పట్టి అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు కూడా వర్షం అడపాదడపా కురుస్తూనే ఉంది.
చాలాచోట్ల మండపాలు తడిసిపోయాయి. అయినా భక్తులు అలాగే వర్షంలో తడుస్తూనే విఘ్ననాయకుడికి పూజలు చేశారు. ఈసారి మాత్రమే వినాయకచవితికి చంద్రడు కనిపించలేదని, ప్రతిసారీ తప్పనిసరిగా వస్తాడని పలువురు అర్చకులు కూడా అన్నారు. అయితే.. వినాయక చవితి రోజున పూజ చేసుకుని, కథ విని అక్షింతలు వేసుకుంటే చంద్రుడిని చూసినా ఎలాంటి సమస్య ఉండబోదని వారు చెప్పారు. మొత్తానికి కావాలని చూడాలనుకున్నవారికి కూడా చవితి చంద్రుడు కనిపించకపోవడం ఈసారి విశేషం!