పాక్ పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికేసిన ఐఎస్ఐ అధికారులు
పాకిస్థాన్ అంటేనే సకల అక్రమాలు, అరాచకాలకు నిలయం. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. దాదాపు 500 మంది అభ్యర్థులు.. వాళ్లలో 50 మంది ఐఎస్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. అంతా పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (ఎన్.ఎ.సి.టి.ఎ.) నిర్వహించిన ఓ పరీక్ష రాశారు. అయితే, దాదాపు అందరూ కాపీరాయుళ్లే. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోడానికి వాళ్లు తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు.
ఎన్.ఎ.సి.టి.ఎ.లో ఉన్న 130 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్ష పెట్టారు. మొత్తం 5 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా, వారి కోసం పది మంది ఇన్విజిలేటర్లున్నారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే, వందలాదిమంది అభ్యర్థులు తమ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ దొరికేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేవాళ్లే కాదు.. ఇన్విజిలేటర్లు కూడా అక్రమార్కులేనట! ఎందుకంటే, పరీక్ష రాస్తున్న వాళ్లలో కొందరు అభ్యర్థులకు వాళ్లు సాయం చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి.
పరీక్షలలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ఎన్.ఎ.సి.టి.ఎ. సమన్వయకర్త హైదర్ అలీ అంగీకరించారు. ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఆలస్యంగా అందాయని, తర్వత వాళ్లు ఫోన్లలో ఇంటర్నెట్ చూసి జవాబులు వెతుక్కున్నారని ఆయన చెప్పారు. ఇన్విజిలేటర్లు తమవద్ద ఉన్న మొబైల్ ఫోన్లను ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేశారంటూ ఎదురు ఫిర్యాదులు కూడా చేశారట!!