ఎస్బీహెచ్ నుంచి మాట్లాడుతున్నామంటూ..
కడప కార్పొరేషన్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కోఠీ శాఖ నుంచి మాట్లాడుతున్నామని ఫోన్ చేసి ఖాతాలో ఉన్న రూ.49వేల నగదును డ్రా చేసుకున్న ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కాగితాల పెంట సమీపంలోని సత్తార్ కాలనీలో నివాసముంటున్న ఎస్. ఖాదర్ అమీన్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మెయిన్ బ్రాంచిలో ఖాతా ఉంది. కాగా సోమవారం ఉదయం 6.19 గంటలకు 7431951929 ఫోన్ నంబర్ నుంచి ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హిందీలో మాట్లాడుతూ నేను ఎస్బీహెచ్, కోఠి శాఖ నుంచి మాట్లాడుతున్నాను, మీ ఏటీఎం కార్డు తాత్కాలికంగా పనిచేయడం లేదు, మీ ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు నంబర్లు చెబితే పనిచేస్తుందని చెప్పాడు. దీంతో ఖాదర్ తన ఆధార్‌కార్డు, ఏటీఎం కార్డుపై ఉన్న నంబర్లు చెప్పాడు, మీరు లైన్లోనే ఉండండి, ఒక మెసేజ్ వస్తుందని చెప్పాడు, అన్నట్లుగానే కొద్ది సెకన్లలోనే మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఉన్న పాస్వర్డ్ చెప్పమనగా అది కూడా చెప్పడంతో బ్యాంకులో ఉన్న మొత్తం బ్యాలెన్స్ రూ. 49వేలు విత్‌డ్రా చేసినట్లుగా మెసేజ్ రావడంతో అవాక్కయ్యాడు. బ్యాంకులో ఆరాతీయగా ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల ఆ నగదు డ్రా అయిందని చెప్పారు. చేసేది లేక బాధితుడు కడప తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.