ప్రత్యేక సేవలతో ఆకట్టుకున్న హైస్పీడ్ ట్రైన్!
హైస్పీడ్ ట్రైన్ ప్రారంభమైన తరుణంలో హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో కొత్తగా కనిపించిన దృశ్యం.. ప్రయాణీకులను అమితంగా ఆకట్టుకుంది. నీలం కోట్లు, బ్లాక్ ప్యాంట్లు ధరించి, ముఖంలో చిరు మందహాసంతో హోస్టెస్ లు మంగళవారం ఉదయం ప్రయాణీకులకు ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం.. అత్యంత ఆసక్తికరంగా కనిపించింది. ఇప్పటివరకూ ఒక్క విమాన ప్రయాణీకులకు మాత్రమే అందుబాటులో ఉన్న హోస్టెస్ సేవలు ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్.. గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కూడ ప్రవేశ పెట్టడంతో రైల్వే స్టేషన్ లోని సన్నివేశం అందరినీ ఆకర్షించింది.
లేడీజ్ అండ్ జెంటిల్మెన్.. అంటూ ప్రయాణీకులు రైల్లో పాటించాల్సిన నియమ నిబంధనలను ప్రయాణీకులకు హోస్టెస్ లు వివరించడం విమాన ప్రయాణాన్ని తలపించింది. సీట్ బెల్టులు పెట్టుకోమని, ఆక్సిజన్ మాస్క్ లు ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుపుతూ వారిచ్చే సలహాలు, సూచనలపై ప్రయాణీకులు ఆసక్తిగా వినటం కొత్త గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో కనిపించింది.
హోస్టెస్ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు... ఎంతో ఛాలెంజింగ్ గా చేయాల్సిన పని. దేలో మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన అత్యంత వేగవంతమైన ట్రైన్ గతిమాన్ ఎక్స్ ప్రెస్. మొదటిరోజు ప్రయాణం ప్రారంభించగానే ఢిల్లీ ఆగ్రాల మధ్య అది అందుకున్న స్సీడ్ గంటకు సుమారు 160 కిలోమీటర్ల పైమాటే. అలా రైలు వేంగంగా ప్రయాణిస్తున్న సమయంలో హోస్టెస్ లు సీట్ల మధ్యనుంచి ఆహార పదార్థాలతో కూడిన ట్రేలు బ్యాలెన్స్ చేస్తూ, వేడి పానీయాల వంటివి ప్రాయాణీకుల మీద పడకుండా జాగ్రత్తగా సర్వ్ చేయాలి. అటువంటి పనిని సవాలుగా తీసుకొన్న హోస్టెస్ లు.... ఎంతో చాక చక్యంగా నిర్వహించారు. శాఖాహార, మాంసాహార భోజన వివరాలు, రైలు వివరాలను ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందిస్తూ... గతిమాన్ ఎక్స్ ప్రెస్ మొదటి ప్రయాణం ముగింపులో హోస్టెస్ లు ప్రయాణీకుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రయాణీకులు తమకు ఎంతో సహకరించారని, వారు చాలా ఆనందంగా ఉన్నారని, తమనిని సాదరంగా ఆహ్వానించి అభినందించారని గతిమాన్ ఎక్స్ ప్రెస్ లో మొదటిరోజు విధులు నిర్వహించిన హోస్టెస్ మాయా తెలిపారు. అయితే ఇటువంటి సేవలు ప్రతి రైల్లోనూ అందించవచ్చుకదా అని అడిగిన ప్రశ్నకు ఆమె సానుకూలంగానే స్పందించినా... అన్ని రైళ్ళలో ఈ సేవలు మహిళలు అందించడం అంత సులభం కాదన్నారు. గతిమాన్ హైక్లాస్ ట్రైన్ కావడంతోపాటు... అందులో ఉన్న సౌకర్యాలు, సమయం అన్నివిధాల మహిళలకు సహకరించే విధంగా ఉంటుందన్నారు. ఈ ట్రైన్ లో ఆన్ బోర్డ్ సేవల ఏర్పాట్లను (క్యాటరింగ్ నుంచి హౌస్ కీపింగ్ వరకూ) ఐఆర్ సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఉదయం రైల్వే మంత్రి సురేష్ ప్రభు జెండా ఊపగా పట్టాలెక్కిన గతిమాన్ ఎక్స్ ప్రెస్.. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణీకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించింది. హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ఆగ్రావరకూ కేవలం 100 నిమిషాల్లో చేరుకొంది. విమాన సర్వీసుకు దీటుగా అన్ని ప్రత్యేక సదుపాయాలను అందుకున్న ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేశారు.