అపూర్వ గురుభక్తి
సినిమా వాళ్లకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అని ఆశ్చర్యపోకండి! చాలా కాలం తరువాత తెలుగులో నేరుగా సినిమా (పేరు ‘చీకటి రాజ్యం’) చేస్తూ, ఆ షూటింగ్ కోసం భాగ్యనగరికి వచ్చిన నటుడు కమల్‌హాసన్ మాటల్లో అచ్చంగా సెంటిమెంట్, తనను ఇంతవాణ్ణి చేసిన దర్శక గురువు స్వర్గీయ కె. బాలచందర్ పట్ల అపారమైన భక్తి కనిపించాయి. కొద్దినెలల క్రితం మరణించిన బాలచందర్‌ను ఈ ‘విశ్వనటుడు’ గుర్తుచేసుకుంటూ, భౌతికంగా దూరమైనా అలాంటి పెద్దలు చూపిన ప్రభావం అలాగే ఉండిపోతుందన్నారు.
‘‘నా అలవాట్లు, నా కోపం, నా నటన దగ్గర నుంచి రచన దాకా అన్నీ నేను కె.బి. సార్ నుంచి, ఆయన సహాయకులైన అనంతు గారి దగ్గర నుంచి నేర్చుకున్నవే’’ అని వినయంగా ఒప్పుకున్నారు. దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ సినిమాలు చేసి, కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న కమల్ మాత్రం ఈ 50 ఏళ్ళ పైచిలుకు కెరీర్లో కె.బి. దర్శకత్వంలో తాను పనిచేసిన 36 సినిమాలే తన అసలైన స్కోర్ అనడం విశేషం. ‘‘ఇటీవలి ‘ఉత్తమ విలన్’లో మేమిద్దరం కలసి పనిచేసిన 37వ చిత్రం.
నా కెరీర్లో నేను సాధించిన పెద్ద విజయం ఇదే’’ అన్నారాయన. తన లాగానే కె.బి. ద్వారా పైకొచ్చిన తరువాతి తరం శిష్యుడు ప్రకాశ్‌రాజ్‌ను ప్రస్తావిస్తూ, ‘‘కె.బి. భౌతికంగా లేరని బాధపడుతున్న ప్రకాశ్‌కు ఒక పెద్దన్న లాగా పక్కన ఉంటానని చెప్పా’’ అని ప్రకటించారు. వేదికపై కమల్ ఈ మాటలు చెబుతున్నప్పుడు కిందనున్న ప్రకాశ్‌రాజ్ కళ్ళలో తడి, ఎప్పుడూ ప్రెస్‌మీట్స్‌కి పెద్దగా రాని త్రిష ముఖంలో అబ్బురం కనిపించాయి. విద్య నేర్పిన గురువు మీద, ప్రతిభావంతుడైన సీనియర్ సహచరుడి మీద అసలు సిసలు గురుభక్తి అంటే బహుశా ఇదేనేమో!