ఇంకా చీప్ గా 4జీ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఇప్పుడు 4జీ వార్ కొనసాగుతోంది. ఈ వార్ తో 4జీ స్మార్ట్ ఫోన్ ధర అమాంతం పడిపోతోంది. గతేడాది అతి చౌకైన 4జీ స్మార్ట్ ఫోన్ రూ.8,000 దొరికితే, ఈ ఏడాది అది రూ.3,650 కే అది లభ్యం అవుతోంది. ఈ ధరలు మరింత కిందకు జారనున్నాయి. 2016 చివరి నాటికి 4జీ స్మార్ట్ ఫోన్లు కేవలం రూ.2,700కే దొరకనున్నట్లు మార్కెట్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ స్పీడు కల్గిన డేటాలను వినియోగదారులకు అందించేందుకు అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు పోటీ పడుతున్నాయి. తక్కువ ధరలకే 4జీ సేవలు అందించడంలో భారతి ఎయిర్ టెల్ మొదటిస్థానంలో ఉండగా, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ముఖేశ్ అంబానీ సంస్థ కూడా ఈ రకమైన సేవలను అందించేందుకే రిలయన్స్ జియో ఇన్ఫోకాంను ఆవిష్కరించింది.
కేవలం రూ.3,999కే 4జీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తున్న మొదటి కంపెనీ చైనీస్ హ్యాండ్ సెట్ కంపెనీ పికామ్. డిస్కౌంట్స్ తో కలిపి ఈ ఫోన్ ను వినియోగదారుల ముందుకు తెచ్చింది. భారత్ లోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా అవతరించిన మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మాటిక్స్ మరికొన్ని నెలల్లో 4జీ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 4జీ ఫోన్లన్నీ ఎక్కువగా 1800 మెగాహెడ్జ్‌పై ఎఫ్డీ ఎల్టీఈ, 2300 మెగాహెడ్జ్‌పై టీడీఎల్టీఈలను సపోర్టు చేస్తున్నాయి. వొడాపోన్ , ఐడియా కేవలం ఎఫ్ఎల్టీఈనే బ్యాండ్లను ఆఫర్ చేస్తున్నాయి.
రెండు ప్రధాన కారణాలతో ఈ 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఒకటి మార్కెట్లో డిమాండ్ ను ముందుగానే గుర్తించిన టెలికాం ఆపరేటర్ల మధ్య పోటీ వాతావరణం నెలకొనడం. రెండోంది 4జీ టెక్నాలజీని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం. చైనా, తైవాన్, కొరియా, జపాన్ వంటి దేశాలు తక్కువ ధరలకే చిప్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి.
భారత 4జీ స్మార్ట్ ఫోన్ విభాగంలో శ్యామ్‌సంగ్ మొదటిస్థానంలో ఉండగా, లెనోవా, షియోమి, మైక్రోమ్యాక్స్, యాపిల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 3జీ స్మార్ట్ ఫోన్ల ధరల విషయంలో మనం ఏమైతే గమనించామో, 4జీ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా అంతకంటే త్వరగా పడిపోతాయని మైక్రోమాక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుబజిత్ సేన్ చెప్పారు.