వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
చెళ్లకెరె రూరల్ :వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తాలూకాలోని బెళగెరె నారాయణపుర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంజుల(26) ఆత్మహత్య చేసుకున్న వివాహిత . మంజుల అన్న హరీష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బళ్లారి జిల్లా కూడ్లిగి తాలూకా ఎంబి హళ్లి గ్రామానికి చెందిన తాను తన చెల్లెలిని యేడాది క్రితం చెళ్లకెరె తాలూకా బెళగెరె నారాయణపుర గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే వివాహం అయిన కొద్ది రోజులకే పుట్టినింటి నుంచి లక్షల రూపాయల కట్నం ఇవ్వాలని భర్త ఇంటి వారు వేధించడం మొదలు పెట్టారు.
ఓమారు రూ.50 వేలు ఇచ్చి పంపినా మళ్లీ లక్ష రూపాయలు కావాలని తగాదా మొదలు పెట్టారు. దీంతో విసిగి పోయిన మంజుల బుదవారం విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న హరీష్ తన చెల్లెలు మరణానికి అత్తమామలు, భర్త సతీష్, బావ నాగరాజ్, వదిన గీతలే కారణమని చెళ్లకెరె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీరిని అరెస్టు చేసే వరకు తన చెల్లెలు మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకు వెళ్లేది లేదని పట్టుబట్టాడు. అయితే సతీష్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని, మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించాడు. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి తహశీల్దార్ శ్రీధరమూర్తి, డీఎస్పీ ఎం.శ్రీనివాస్‌లు చేరుకుని పరిశీలన జరిపారు.