చెన్నూరు చేపలకు భలే గిరాకీ
చెన్నూరు, న్యూస్‌లైన్: చెన్నూరు కేంద్రంగా చేపల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ నాణ్యమైన చేపలను ఇక్కడి నుంచే జిల్లా నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఆదివారానికి ముందురోజు (శనివారం) భారీగా విక్రయాలు జరుగుతాయి. ఈ ఒక్క రోజులోనే 7 నుంచి 10 టన్నుల చేపలను హోల్‌సేల్ ధరలకు విక్రయిస్తారు. అన్ని రకాల చేపలు ఇక్కడ లభిస్తుండటంతో పాటు నాణ్యతగా ఉండటంతో ఆరేళ్లుగా అమ్మకాలు విస్తరిస్తున్నాయి. వారానికి 10 నుంచి 15 లక్షల చేపల వ్యాపారం ఇక్కడ జరుగుతోంది.
ఇదిలా ఉండగా నెల రోజులుగా చేపల ధరలు భారీగా పెరిగాయి.
కిలో చేప రూ. 50 నుంచి 90 లోపు ఉండగా ప్రస్తుతం 80 నుంచి 130కి పెరిగింది. చెన్నూరు వద్ద బొచ్చ, రోకు, గడ్డిమోసు, కాకిగండె, కొరమీను రకం చేపలు లభిస్తాయి. ఇటీవల స్థానిక పెన్నానదిలో చేపలు తక్కువగా పడుతున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్‌లో ప్రతి రోజు అక్రమ చేపల వేట సాగుతోందని, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోక పోవడంతో తమకు చేపలు పడటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నూరులో చేపలు పట్టి అమ్మకాలు చేసే కుటుంబాలు 150 వరకు ఉన్నాయి. వీరందరూ చేపల అమ్మకం ద్వారానే దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. గతంలో నెల్లూరు జిల్లా సంఘం, బుచ్చి వంటి చోట్ల చేపలు తెప్పించేవారు.
అలాగే స్థానిక పెన్నానదిలో చేపలు పట్టి తక్కువ ధరలతో విక్రయించేవారు. ప్రస్తుతం 600 కిలో మీటర్ల దూరంలో ఉన్న విజయవాడ, కైకలూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటుండటంతో రవాణాతో పాటు ఖర్చు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కిలో చేపలు 150 నుంచి 180 వరకు అమ్మాల్సి వస్తున్నదని, వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు అక్రమ చేపల వేటను నిరోధిస్తే ప్రయోజనం ఉంటుందని, ధరలు తగ్గించవచ్చని స్థానిక మత్య్సకారులు చెబుతున్నారు.
చేపల వేటను నిరోధించాలి
సోమశిల డ్యాం నుంచి పెన్నానదిలోకి చేపలు వస్తాయి. అక్రమంగా చేపలు పడుతుండటంతో చాలా తక్కువగా వస్తున్నాయి. విజయవాడ, కైకలూరు ప్రాంతాల నుంచి చేపలను దిగుమతి చేసుకుని జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలిస్తున్నాం. అధికారులు అక్రమ వేటను నిరోధించాలి
- పీసు సుబ్బరాయుడు మత్య్సకారుడు, చెన్నూరు
చాలా ఇబ్బంది పడుతున్నాం
ధరలు భారీగా పెరగడంతో చేపలు కొని అమ్మకాలు చేయలేకున్నాం. పెన్నానదిలో చేపలు చాలా తక్కువ పడుతుండటంతో కొనుగోలు చేసే అమ్మాలి. చుట్టూ ఉన్న జిల్లాల్లో లభించక పోవడంతో 600 కిలోమీటర్ల నుంచి తెప్పిస్తున్నాం. వారు కిలో రూ. 100కు పైగానే అమ్ముతున్నారు.
- సి.శంకర్ మత్య్సకారుడు చెన్నూరు