సముద్రంలో సంబరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కమోవ్ 28, చేతక్ హెలికాప్టర్ల విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయి... మెరైన్ కమెండోల స్కై డైవింగ్ అబ్బురపరిచింది... శత్రు రాడార్లకు కూడా దొరకనంత వేగంతో యుద్ధనౌకలు దూసుకువచ్చి లక్ష్యాలపై మిస్సైళ్ల వర్షం కురిపించాయి. అత్యంత సుశిక్షితులైన మార్కోస్ కమాండోల ఆపరేషన్లు ఒళ్లు గగుర్పాటు కలిగించాయి... వెరసి విశాఖపట్నంలో తూర్పునౌకాదళం భారత సైనికపాటవాన్ని మరోసారి చాటిచెప్పింది.
1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో విజయానికి ప్రతికగా తూర్పు నౌకాదళం ఏటా డిసెంబర్ 4న ‘నేవీ డే’ను నిర్వహిస్తుంది. ఈ మేరకు విశాఖపట్న బీచ్‌లో గురువారం ‘నేవీ డే’ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. తూర్పు నౌకాదళ అధిపతి, వైస్ అడ్మిరల్ సతీష్ సోనీ నేతృత్వంలో నిర్వహించిన ఈ ‘నేవీ డే’ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సగర్వంగా భారత సైనిక పాటవ ప్రదర్శన
నేవీ డే ఉత్సవాలు ప్రారంభం కాగానే మెరైన్ కమెండోలు హఠాత్తుగా వినువీధిలో చేసిన స్కై డైవింగ్‌తో ఒక్కసారిగా అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. భారత జాతీయ పతాకం, నేవీ పతాకాలను చేతబూని స్కూడైవర్స్ ఆకాశంలో విన్యాసాలు చేస్తూ నిర్ణీత లక్ష్యంలో కిందకు దిగారు. అనంతరం కొద్ది క్షణాల్లోనే నౌకాదళానికి చెందిన కమోవ్ 28, యూహెచ్3హెచ్, చేతక్ హెలికాప్టర్లు అద్భుతరీతిలో ఆకాశ వీధిలో విన్యాసాలు చేశాయి. శత్రురాడార్లు గుర్తించలేనంత వేగంతో యుద్ధ నౌకలు నిర్భీక్, వినాశ్, విభూతి తీరంవైపు దూసుకువచ్చి చేసిన లక్ష్యాలపై మిస్సైళ్లతో చేసిన దాడి అబ్బురపరిచింది.