'నారాయణఖేడ్ ఉపఎన్నికలను వాయిదా వేయాలి'
హైదరాబాద్ : నారాయణఖేడ్ ఉప ఎన్నికలను వాయిదా వేయాలని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్‌తో కలసి ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీని సోమవారం కలిశారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ప్రింటర్ ఈవీఎంలను ప్రవేశ పెట్టాలని లేదంటే బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలని కోరారు. ఇప్పటికిప్పుడు ఈ రెండు సాధ్యం కాకుంటే ఉప ఎన్నికను తాత్కాలికంగా వాయిదా వేయాలని వినతి పత్రం అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నిక సమయంలోనే తమకు అనుమానం వచ్చిందని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ అనుమానాలు నిజమయ్యాయని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్కు కచ్చితంగా 100 స్థానాలు వస్తాయని కెటీఆర్ ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. ఈవీఎంలను టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాంపరింగ్ చేసిందని, ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని శ్రవణ్ స్పష్టం చేశారు.