ముచ్చర్ల టు సీఎం ఇంటికి..
♦ పాదయాత్రను ప్రారంభించిన తమ్మినేని వీరభద్రం
♦ ఫార్మాసిటీ రైతులకు న్యాయం చేయాలని డిమాండ్
♦ 16 కి.మీ తర్వాత అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత
♦ ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట
కందుకూరు : రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఫార్మాసిటీకి భూములు అప్పగించడం అన్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటు కానున్న ఫార్మాసిటీకి కేటాయించిన సర్వే నంబర్ 288లోని భూమికి సంబంధించిన సర్టిఫికెట్దారులు పరిహారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ముచ్చర్ల నుంచి సీఎం ఇంటి వరకు పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫార్మాసిటీకి కేటాయించిన భూముల్లో 1992లో 221 మంది నిరుపేదలకు ఎకరా చొప్పున పట్టాలు, పాస్‌పుస్తకాలు ఇచ్చి, 1బీ రికార్డులో నమోదు చేశారన్నారు. అప్పటి నుంచి ఆ భూముల్నే నమ్ముకున్న వారికి న్యాయం చేయకుండా భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వడం అన్యాయమన్నారు. కందుకూరు, యాచారం, ఆమన్‌గల్ మండలాల పరిధిలో 12 వేల ఎకరాల భూములను బలవంతంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు.
ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ముచ్చర్ల నుంచి దెబ్బడగూడ, కందుకూరు మీదుగా శ్రీశైలం రహదారిపైన రాచులూరు గేట్ సమీపంలోని పెద్దమ్మ గుడి వరకు దాదాపు 16 కిలోమీటర్ల మేర చేసిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. పెద్దమ్మ గుడి వద్ద మధ్యాహ్న భోజనం ముగించుకుని సాయంత్రం తిరిగి సీపీఎం డివిజన్ కార్యదర్శి రాంచందర్ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కందుకూరు, ఆదిబట్ల, మహేశ్వరం సీఐలు విజయ్‌కుమార్, అశోక్‌కుమార్, మన్మోహన్‌ల ఆధ్వర్యంలో పోలీసులు పాదయాత్ర చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని కందుకూరు పీఎస్‌కు తరలించారు.
పాదయాత్రకు టీడీపీ నాయకులు రాంచంద్రారెడ్డి, సత్తయ్య, ఎంపీటీసీ సభ్యులు నర్సింహ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సోమయ్య, డివిజన్ కార్యదర్శి డి.రాంచందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ మీనా, బి.కనకయ్య, దత్తునాయక్, కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్ మండలాల కార్యదర్శులు కుమార్, రవికుమార్, శంకర్, నాయకులు కృష్ణ, బి.శ్రీను, పి.జంగయ్య, వెంకటరమణ, పి.వెంకటయ్య, ఎన్.నర్సింహా, గౌర శ్రీశైలం, జగన్ తదితరులు పాల్గొన్నారు.