పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ నేతల ధర్నా
ఎమ్మెల్యే జేసీపై కేసు ఎత్తేయాలని డిమాండ్
తాడిపత్రి : తాడిపత్రిలోని ఏటీఎం సెంటర్ల వద్ద పరిశుభ్రత విషయంలో తనను బెదిరించారన్న చీఫ్ మేనేజర్ మంజుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు మంగళవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ముట్టడికి ప్రయత్నించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్బీఐ రెండు బ్రాంచీలతోపాటు పట్టణమంతా పోలీసులు భారీగా మోహరించి ఉండటంతో ముట్టడియత్నం విరమించుకుని టీడీపీ నేతలు పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. అంతకు మునుపు పచ్చదనం- పరిశుభ్రత కోసం రాజీలేకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యేపై కేసు ఎలా నమోదు చేస్తారు... చెత్తను తొలగించమని చెప్పడమూ తప్పేనా.. శుచీశుభ్రత సామాన్యులకేనా.. అధికారులకు వర్తించదా.. అంటూ మున్సిపల్ చైర్పర్సన్ వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ జిలాన్‌బాషా, టీడీపీ నాయకులు సూర్యముని, జగదీశ్వరరెడ్డి, ఎస్.వి.రవీంద్రారెడ్డి, అయాబ్బాషా, ఫయాజ్ బాష, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇ.సి.వెంకటరమణ, కౌన్సిలర్లు, కార్యకర్తలతోపాటు ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేపై కేసును ఎత్తివేయాలని పలువురు నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని అడిషనల్ ఏఎస్పీలు మాల్యాద్రి, అభిషేక్ మహంతి, డీఎస్పీ నాగరాజు హామీ ఇవ్వడంతో నాయకులు శాంతించి ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం ఎస్బీఐ మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ మంజుల పట్టణ ఎస్ఐని కలిసి తాను బ్యాంకుకు భద్రత కల్పించాలని మాత్రమే కోరానని, ఎమ్మెల్యేపై ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నాని వనతి పత్రం సమర్పించారు.
పోలీసుల వైఖరితోనే వివాదం
ఎస్బీఐ వివాదానికి మూలకారణం పోలీసుల వైఖరేనని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. తనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం వారి అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. తాడిపత్రి మున్సిపాల్టీ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపై ఎస్పీని కలుస్తానన్నారు.