స్మితా సబర్వాల్‌కు ఆర్థిక సాయంపై పిల్
* కోర్టు ఖర్చులకు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇవ్వడంపై అభ్యంతరం
* ఆ ఉత్తర్వులు కొట్టివేయాలని హైకోర్టును కోరిన పిటిషనర్
సాక్షి, హైదరాబాద్ : ‘ఔట్లుక్’ మ్యాగజైన్ కథనం వివాదంలో ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.15 లక్షలు మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. స్మితా సబర్వాల్ వ్యక్తిగత వ్యవహారంలో ఇలా ప్రజాధనాన్ని ఆమెకు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రచయిత, సామాజిక కార్యకర్త వత్సల విద్యాసాగర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్మిత సబర్వాల్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఔట్లుక్ మ్యాగజైన్ ఇటీవల ప్రచురించిన ఓ కథనం, కార్టూన్ తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ స్మితా సబర్వాల్ ఆ మ్యాగజైన్‌పై న్యాయపరమైన చర్యలు ప్రారంభించారని పిటిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆ పత్రికపై రూ.10 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారన్నారు.
స్మితా సబర్వాల్ ఓ హోటలో పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమం గురించి సదరు పత్రిక కథనం, కార్టూన్ ప్రచురించిందని, ఇది ఆమె వ్యక్తిగత వ్యవహారమని వత్సల పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయ వివాదంలో గెలిస్తే మంజూరు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని చెప్పిన ప్రభుత్వం, ఓడిపోతే ఆ మొత్తాన్ని వదులుకున్నట్లు పరోక్షంగా తన ఉత్తర్వుల్లో పేర్కొందని తెలిపారు.