అడుగులు తడబడొద్దు
జమ్మూ-కశ్మీర్లో అపశ్రుతులతో ప్రయాణం ప్రారంభించిన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టే ఒడిదుడుకులతో నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బీజేపీకి చెందిన ఉప ముఖ్యమంత్రిని పక్కనబెట్టుకుని ‘ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించినందుకు’ పాకిస్థాన్‌కూ, కశ్మీర్‌లోని మిలిటెంట్లకూ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కృతజ్ఞతలు చెప్పినప్పుడే ఈ కూటమి సర్కారు ఎన్నాళ్లు కొనసాగుతుందోనని అందరూ సంశయం వ్యక్తంచేశారు. అధికారానికొచ్చి పట్టుమని పదిరోజులు గడవకుండానే సయీద్ ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు.
నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్న కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు మసరత్ ఆలం విడుదలకు చర్య తీసుకున్నారు. ఆలం మాత్రమే కాదు... అలా ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్న వారందరి విడుదలపైనా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటు దద్దరిల్లింది. విపక్షాలు వాకౌట్ చేశాయి. ఆలం విడుదలపై కశ్మీర్ ప్రభుత్వం తమను సంప్రదించలేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అయితే, తాజాగా వెల్లడవుతున్న వివరాలనుబట్టి చూస్తే ఆయన విడుదలకు సంబంధించిన ప్రక్రియ అంతా గవర్నర్ పాలన ఉన్న 49 రోజుల్లోనే మొదలైందని తెలుస్తున్నది. గవర్నర్ పాలన అంటే కేంద్ర పాలనే. కేంద్రాన్ని సంప్రదించాకే గవర్నర్ ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. కనుక జరిగిన వ్యవహారంలో తమ పాత్ర లేదని ఇప్పుడు కేంద్రం ఇస్తున్న జవాబు సహేతుకంగా లేదు. తమ ప్రమేయం లేకుండా జరిగిన ఒక వ్యవహారాన్ని సొంతం చేసుకుని, దానివల్ల లబ్ధిపొందుదామని పీడీపీ భావించడంవల్లే ఆలం విడుదల ఇంత కల్లోలాన్ని సృష్టించిందన్నది విశ్లేషకుల వాదన.
జాతీయవాద పార్టీగా బీజేపీకి కశ్మీర్‌పై ప్రత్యేక అభిప్రాయాలున్నాయి. నిజానికి ఆలం విడుదల గనుక నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి పాలనలో జరిగుంటే జమ్మూ ప్రాంతాన్ని బీజేపీ రోజుల తరబడి స్తంభింపజేయడంతోపాటు ఢిల్లీని ఆందోళనలతో హోరెత్తించేది. పార్లమెంటును స్తంభింపజేసేది. అయితే, కేంద్రంలో పాలిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంవల్ల బీజేపీకి ఇవన్నీ సాధ్యం కాలేదు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని కాంగ్రెస్, తృణమూల్, ఆర్జేడీలు ఆ పాత్ర పోషించడానికి ప్రయత్నించాయి. ఆగ్రహావేశాలతో రగిలి పోయాయి. పార్లమెంటు వెలుపలా, బయటా ఇంత జరిగాక బీజేపీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇకపై తమను సంప్రదించకుండా ఎవరినీ విడుదల చేయడానికి వీల్లేదని బీజేపీ స్పష్టం చేసిందంటున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పట్లో రాజకీయ ఖైదీల విడుదల ఉండబోదని జమ్మూ-కశ్మీర్ హోం కార్యదర్శి ప్రకటించారు కూడా.
కశ్మీర్లో మొదటినుంచీ వేర్పాటువాద భావనల ప్రభావం ఏమేరకు ఉన్నదో ఎవరికీ తెలియనిది కాదు. అయితే, అది ఇటీవలికాలంలో తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హింసాత్మక ఘటనల సంఖ్య గణనీయంగా తగ్గింది. మిలిటెంట్లకు మునుపటిలా ఆదరణ లేదు. కశ్మీర్ పౌరులు ఉత్సాహంగా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోవడమే దీనికి రుజువు. అయితే, ఇదంతా ఆలం అరెస్టు వల్లే సాధ్యమైందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెబుతున్నారు. 2010లో కశ్మీర్ హింసతో అట్టుడకటానికి ఆలం ముఖ్య కారకుడని, ఆయన్ను అరెస్టు చేశాకే అవి అదుపులోకి వచ్చాయని ఆయన అంటున్నారు. ఇదంతా నిజమే అనుకున్నా... అంతటి హింసావాదిపై 26 క్రిమినల్ కేసులు పెడితే ఒక్క కేసులోనూ ప్రభుత్వం రుజువులెందుకు చూపలేకపోయింది? ఇందులో ఒక కేసులో ఆయన నిర్దోషిగా బయటపడగా మిగిలిన కేసులన్నిటిలోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఈ నాలుగేళ్లనుంచీ ఆయన జైల్లో ఉంటున్నది భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కాదు. రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరంగా రూపొందించి అమలు చేస్తున్న ప్రజా భద్రత చట్టంకింద మాత్రమే. ఆ చట్టం కిందనైనా ఒక వ్యక్తిని విచారణ లేకుండా ఆరునెలల పాటు జైల్లో నిర్బంధించవచ్చు. దాన్ని ఆరు నెలలకొకసారి పొడిగించవచ్చు. అలా నాలుగేళ్లనుంచి ఆలం జైల్లో ఉంటున్నాడు.
ఇది పాలకుల అసమర్థతనే వెల్లడిస్తున్నది. నిర్బంధానికి వీలుకల్పించే పాలనాపరమైన చట్టాలు చట్టబద్ధపాలనకు ఆటంకమవు తాయని సుప్రీంకోర్టు ఒక సందర్భంలో అనడంతోపాటు వాటిని ‘న్యాయరహిత చట్టాలు’గా అభివర్ణించింది. అలాంటి చట్టం కింద ఒక వ్యక్తిని ఏళ్లతరబడి నిర్బంధించడం మన ప్రజాస్వామిక వ్యవస్థ ప్రతిష్టను పెంచదు. పార్లమెంటులో కనీసం ఏ ఒక్కరూ దీన్ని ప్రస్తావించలేకపోయారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన కార్య కలాపాలకు పాల్పడుతున్నారని భావించినప్పుడు వారిపై నేరారోపణలు మోపి, పకడ్బందీగా దర్యాప్తు సాగించి శిక్షపడేలా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానిది. ఆ పని చేయడం చేతగాకనో, అంత ఓపిక లేకనో ప్రజా భద్రతా చట్టంవంటి సులభమైన తోవను ఎంచుకుంటున్నారు. ఏదైనా అరుదైన, అవసరమైన సందర్భాల మాటేమోగానీ... పిడుక్కి, బియ్యానికి ఒకటే మంత్రమన్నట్టు అందరిపైనా ఆ చట్టాన్నే ఉపయోగించాలని చూడటం ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతుంది.
ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న కశ్మీర్ లోయలో సదవగాహన పెంపొందడం అవసరం. కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) కింద పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ కార్యక్రమం 370వ అధికరణపై యథాతథ స్థితి కొనసాగాలని నిర్ణయించడంతో పాటు హుర్రియత్‌తో సహా కశ్మీర్ సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలతో చర్చించాలని పేర్కొంది. ఎంతో పరిణతితో రూపొందించిన సీఎంపీ పరిధిలో పనిచేయగలిగితే జమ్మూ-కశ్మీర్ రూపురేఖలే మారతాయి. భిన్న ధ్రువాలైనా పీడీపీ, బీజేపీలు సమష్టిగా పనిచేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యం కాగలద న్న విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. దాన్ని రెండు పార్టీలూ నిలబెట్టుకోవాలి.