యువశక్తికి భరోసా ఏది?
ఏలూరు :జిల్లాలో నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఉద్దేశించిన సీఎంఈవై (చీఫ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ ఇన్ యూత్) పథకం ఆచరణకు నోచుకునే పరిస్థితి కానరావడం లేదు. ఇప్పటికే ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. మిగిలిన ఐదు నెలల్లో పథకాన్ని యువత ముంగిటకు తీసుకువెళ్లే అవకాశాలు కానరావడం లేదు. దీంతో వారికి శిక్షణ ఇచ్చి చేతులు దులుపునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటివరకు యూనిట్ల స్థాపన లక్ష్యానికే ఆమోదముద్ర పడలేదు.
ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఎన్నికల్లో యువతను నమ్మించిన చంద్రబాబు ప్రభుత్వం యువశక్తికి జీవితంపై భరోసా కల్పించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2013-14 వరకు రాజీవ్ యువ శక్తి పథకంగా ఉన్న దాన్ని సీఎంఈవైగా టీడీపీ సర్కారు మార్పు చేసింది. అయితే సెట్వెల్ అధికారులు మాత్రం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 520 యూనిట్లను స్థాపించేందుకు లక్ష్యంగా నిర్ణయించి రూ.5.20 కోట్ల రుణ లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. దీంతో సెట్వెల్ అధికారులు గోళ్లు గిల్లుకుంటున్నారు.
యూనిట్లు, గైడ్‌లైన్స్ మార్పు జరిగేనా?
వస్తు స్థాపనకు అనుగుణంగా ఉన్న పరిశ్రమలు, సేవారంగానికి చెందిన యూనిట్లకు మాత్రమే ఆర్థిక సహాయం ఇవ్వడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఇందులో సిమెంట్, ఇటుకల తయారీ, వెల్డింగ్ వర్క్స్, లేస్ తయారీ, బెల్లం, టెంట్ హౌస్, కంప్యూటర్ సెంటర్, ఆటోజిరాక్సు, సెల్పాయింట్లను పెట్టాలే తప్ప మిగతావి నస్థాపించడానికి వీల్లేదు. దీంతో నిరుద్యోగులకు ఈ యూనిట్లు అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాగా టీడీపీ సర్కార్ గైడ్లెన్స్ మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. అది జరిగితే యూనిట్ వ్యయం పెరుగుతుందా? సబ్సిడీ మొత్తం పెరుగుతుందా? అనేది ఇప్పడేమీ చెప్పలేమని అధికారులు అంటున్నారు. గత ఏడాది లక్ష్యంలోను ఇంకా 100 మందికి రుణం అందించాల్సి ఉన్నట్టు సమాచారం. అప్పట్లో ఎన్నికల హడావుడిలో 404 యూనిట్లు లక్ష్యం కాగా 467 యూనిట్లును అధికారులు గ్రౌండింగ్ చేశారు. ఇందులో 367 యూనిట్లకే రూ.3.17 కోట్ల రుణం ఇచ్చారు. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి.
శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానించాం
జిల్లాలో యువతీ యువకులకు 45 రోజుల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానించాం. డిసెంబర్ 8వ తేదీ వరకు గడువు ఉంది. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన మహిళలకు టైలరింగ్, బ్యూటీషీయన్ కోర్సుల్లోను, పురుషులకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ విభాగాల్లో శిక్షణను హైదరాబాద్‌లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. శిక్షణకు ఎంతమందినైనా అక్కడకు పంపించే వీలుంది. దరఖాస్తు గడువును నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. సీఎంఈవై పథకం అమలుకు మార్గదర్శకాలు రాగానే వాటిని స్థాపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.
- పి.సుబ్బారావు, సెట్వెల్ సీఈవో