Chief siddharamayya
-
వెనక్కు తగ్గం
కొనసాగిన రాజీనామాల పర్వం మొత్తం 4,500 మంది వైద్యుల రాజీనామా మంత్రి యూటీ ఖాదర్‌తో చర్చలు విఫలం నేడు సీఎంతో వైద్యుల సంఘం నేతల భేటీ రోగులకు తప్పని తిప్పలు రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సామూహిక రాజీనామాల పరంపర రెండోరోజూ కొనసాగింది. దీంతో ఆస్పత్రుల్లో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. డిమాండ్ల పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్‌తో రాష్ట్ర వైద్య ఉద్యోగుల సంఘం నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో వైద్యుల సంఘం నేతల భేటీ బుధవారం సాయంత్రానికి వాయిదా పడింది. డిమాం డ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని మూడు వేల మంది వైద్యులు సోమవారం సామూహిక రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 1,500 మంది వైద్యులు మంగళవారం తమ ఉద్యోగాలకు రాజీనా మా చేశారు. దీంతో మొత్తం 4,500 మంది వైద్యులు రాజీనామా చేసినటై్లంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య ధ్రువీకరించారు. రాజీనామాల సంఖ్య విషయమై మంత్రి యూటీ ఖాదర్ కానీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శివశైలం కానీ నోరు విప్పడం లేదు. ఇదిలా ఉండగా డిమాండ్ల సాధనలో భాగంగా ఉద్యోగుల సంఘం నేతలు మంగళవారం ఉదయం మంత్రి యూటీ ఖాదర్‌తో చర్చలు జరిపారు. ఇందులో ఎటువంటి పురోగతి కనిపించలేదు. డిమాండ్లలో కొన్నింటికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో తాను ఏమీ చేయలేనని మంత్రి చేతులు ఎత్తేశారు. దీంతో వైద్యుల సంఘం నేతలు చేసేదేమీ లేక ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో చర్చించడానికి సిద్ధపడ్డారు. ఆయన పని ఒత్తిడిలో ఉండడం వల్ల ముందుగా నిర్ణయించినట్లు మంగళవారం ఉదయం 11:30 గంటలకు కాకుండా చర్చలు బుధవారానికి వాయిదా పడ్డాయి. రాజీనామా చేసిన వారు తిరిగి విధుల్లో ఉంటున్నారని సంఘం నేతలు చెబుతున్నా రాష్ట్రంలో అక్కడక్కడ రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యం అందక బాలిక మృతి ఇక వైద్యులు రాజీనామాలు చేస్తూ విధులకు సరిగా హాజరుకాకపోవడంతో ఓ చిన్నారి మరణించింది. రామనగర జిల్లా గుడేమారనహళ్లి ప్రాంతానికి చెందిన రమ్య(10) తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారిని సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రిలో ఉన్న నర్సుల వద్ద మాత్రలు తీసుకొని వెనక్కి వచ్చేశారు. కాగా మంగళవారం ఉదయం జ్వర తీవ్రత పెరిగి రమ్య మృతిచెందింది. తాము పేదవాళ్లం కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి తమ కూతురిని తీసుకెళ్లలేక పోయామని, ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే తమ చిన్నారి ప్రాణాలతో ఉండేదని తల్లిదండ్రులు బోరున విలపించడం అందరినీ కలచివేసింది. రాజీనామాలు అంగీకరించలేదు : సీఎం వైద్యుల సామూహిక రాజీనామాలను ఇప్పటి వరకూ అంగీకరించలేదు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యులు కూడా పట్టువిడుపులు ప్రదర్శించాలి. వెంటనే ఆసుపత్రులు వెళ్లి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలి. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
అందోళన వద్దు
పొగాకు పంటను ఇప్పట్లో నిషేధించం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తాం పొగాకు ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లో జాగృతి అవసరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడి బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు పంటను ఇప్పట్లో నిషేధించబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు వారితో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం పొగాకు పంట నిషేధంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల కారణంగా వచ్చే వ్యాధులకయ్యే ఖర్చుకు సంబంధించిన నివేదికను మంగళవారం ఇక్కడి విధానసౌధలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పొగాకు పంటను నిషేధించినంత మాత్రాన పొగాకు ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్యను తగ్గించలేమని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా ప్రజల్లో జాగృతి కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రభుత్వం తరపున కూడా మద్దతు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పొగాకు రైతులు, పొగాకు బోర్డు, వైద్య నిపుణులతో చర్చించిన అనంతరం పొగాకు పంటపై నిషేధం గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. పొగాకు ఉత్పత్తులపై 10 శాతం పన్నును పెంచాల్సిందిగా ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని, ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్సకు గాను రాష్ట్రంలో ఏడాదికి రూ.983 కోట్లు ఖర్చవుతోందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తమకు నివేదిక అందించిందని సిద్ధరామయ్య తెలిపారు. ఇందులో 35 నుంచి 69 ఏళ్ల లోపు వారికి దాదాపు 73 శాతం ధనాన్ని ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. పొగాకు కారణంగా ఎదురయ్యే కేన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు, క్షయ వంటి వ్యాధుల చికిత్సకు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. కార్యక్రమంలో వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యుటీ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల పునరుద్ధరణ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో చెరువులను ఆక్రమణల నుంచి విముక్తి చేసి, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం బిగించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 37 వేల చెరువులకు గాను తొలి దశలో 12 వేల చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. దీనికి ఈ ఏడాది బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని చెప్పారు. గ్రామీణ చెరువుల పునరుద్ధరణపై గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విధాన సౌధలో ఏర్పాటు చేసినవర్క్షాపులో ఆయన ప్రసంగించారు. అన్ని చెరువులను ఒకే సారి పునరుద్ధరించడం సాధ్యం కాదన్నారు. కనుక దశలవారీ చేపడతామన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని, స్వచ్ఛమైన తాగు నీరు లభిస్తుందని తెలిపారు. కనుక పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. సుమారు 4,500 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై సర్వే చేయించి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. చెరువుల అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా పునరుద్ధరణ పనులు చేపడతామన్నారు. వర్క్‌షాపునకు అధ్యక్షత వహించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ మాట్లాడుతూ రానున్న రెండేళ్లలో 12 వేల చెరువుల పునరుద్ధరణను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఒకటి చొప్పున చెరువులను పునరుద్ధరించడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు నడుం బిగించాలని కోరారు. దీనికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. పర్యావరణవేత్త యల్లప్ప రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని న్యూయార్క్‌లో శుద్ధమైన తాగు నీటి సరఫరా వ్యవస్థ ఉందన్నారు. అలాంటి వ్యవస్థ మరెక్కడా లేదన్నారు. మనం నది నీటిని వాడుతున్నప్పటికీ రెండు వారాలకోసారి పర్యావరణం, వాతావరణంలో మార్పు జరుగుతూనే ఉందని, దీని ప్రభావం నీటిపై ఉంటుందని ఆయన అన్నారు.