శివరామ్‌ను వదలొద్దు: ప్రవళిక తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక బలవన్మరణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. ప్రేమాపెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు.
ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కోస్గి మండలానికి చెందిన శివరామ్ రాథోడ్‌పై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు మాట మార్చారు. గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడడంతోనే ఆత్మహత్య చేసుకుందని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు.. తాజాగా శివరామ్ రాథోడ్ వేధింపులే కారణమంటూ ఆరోపించారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌లు తాజాగా వీడియోలు విడుదల చేశారు. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, రాజకీయాలు చేయొద్దని తల్లి విజయ కోరుతున్నారు. శివరామ్‌ను వదిలిపెట్టొద్దని పోలీసులు కోరారు వాళ్లు.
‘‘నా బిడ్డ చావుకు కారణమయిన వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు జీవితాంతం బయటకు రాకుండా జైల్లోనే పెట్టాలి. నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదు. నా బిడ్డయితే ఇప్పుడు మాకు రాదు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకుంటుందని భావించాం. కానీ వాడి టార్చర్ కారణంగా చనిపోయింది. అయితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ల గొడవలు వాళ్లే చూసుకోవాలి. మమ్మల్ని మాత్రం మీ రాజకీయంలోకి లాగవద్దు. ఇలా చెప్పండి.. అలా చేయండనే సలహాలు ఇవ్వొద్దు. ఇప్పటికే నా బిడ్డ బతుకు ఆగం అయ్యింది. ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా దాక మాత్రం తీసుకొని రావొద్దు. నా బిడ్డ మరణానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధించాలి. నా బిడ్డ ఎలా అయితే ఉరేసుకొని చనిపోయిందో.. అలాగే వాడికి కూడా ఉరేసి చంపాలి.. అని ఆమె చేతులెత్తి నమస్కరించారు.
వరంగల్‌కు చెందిన మర్రి ప్రవళిక(23) ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్‌నగర్‌లోని ఓ వసతిగృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంది. ఈనెల 13న వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజకీయంగా ఈ ఘటన ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది.
ఇక ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. శివరామ్ అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు తేలింది. మరో యువతితో వివాహం నిశ్చయం కావడం తెలిసి.. భరించలేకే ప్రవళిక ప్రాణం తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రేమ వ్యవహారం ప్రవళిక ఇంట్లోనూ తెలుసని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.