రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
చీకటిగూడెం(కేతేపల్లి): మండలంలోని చీకటిగూడెంల శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఆటోను కారు డీకొట్టిన సంఘటనలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం..మండలంలోని చీకటిగూడెం గ్రామంలో మృతి చెందిన తమ బందువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెన్‌పహాడ్ మండల ధూపహాడ్కు చెందిన 12 మంది మంగళవారం ఆటోలో చీకటిగూడెం బయలుదేరారు. ఈ క్రమంలో ఆటో చీకటిగూడెం శివారులో గల హోటల్9 ఎదురుగా ఉన్న కల్వర్టుపైకి చేరుకోగానే రోడు సరిగా లేకపోవటంతో ఆటో డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఇదే సమయంలో విజయవాడ నుంచి∙హైద్రాబాద్ వైపు వెళ్తున్న కారు ఆటోను వెనుక నుంచి∙బలంగా ఢీకొట్టడంతో ఆటో రోడ్డుపై ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ధూపహాడ్కు చెందిన మల్లెంల చిలకమ్మ, రాందేని లక్ష్మినర్సమ్మ, దొరగలి చిలకమ్మ, అత్తి లింగయ్య, పిల్లని రాములమ్మ, పి.మట్టయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ ఎం.కృష్ణయ్య సిబ్బందితో కలసి ప్రమాద సంఘటన స్థలం వద్దకు చేరుకున్నాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108, హైవే 1033 అంబులెన్స్‌లలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన కారు, ఆటోలను జీఎమ్మార్ సిబ్బంది, క్రేన్ సహాయంలో పోలీసులు పక్కకు తొలగించి హైవేపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కేతేపల్లి ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు.