గర్భవతిని పొడిచిపొడిచి చంపారు
ఒమన్: ఒమన్‌లో ఓ భారతీయ మహిళా నర్సు దారుణ హత్యకు గురైంది. తన సొంత అపార్ట్ మెంట్లో కత్తిపోట్లకు గురై ప్రాణాలు విడిచి ఆమె విగత జీవిగా పడి ఉంది. మరో విషాదమేమంటే ఆమె గర్భవతి కూడా. ఒమన్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం గర్భవతి అయిన చిక్కు రాబర్ట్ అనే కేరళకు చెందిన మహిళను దాదాపు పన్నెండు సార్లు పొడిచి చంపేశారు.
కేరళకు చెందిన ఆమె, తన భర్తతో కలిసి దోఫార్ ప్రావిన్స్ లోని సలాలాహ్ నగరంలోగల బదర్ అల్ సమా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి గత నాలుగు నెలలకిందటే వివాహం అయింది. బుధవారం సాయంత్రం పదిగంటల ప్రాంతంలో విధుల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన ఆమె అనంతరం కత్తిపోట్లకు గురైంది. విధులకు హాజరుకానీ తన భార్య కోసం ఇంటికి వెళ్లిన భర్తకు ఆమె విగతజీవిగా కనిపించడంతో అతడు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా ఈ విషయం తెలిసింది. వారి ఇంటిపక్కన ఉండే పాకిస్థాన్ వ్యక్తిని పోలీసులు అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అతడు దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకోవడంతో ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.