అందరూ బాహుబలి పెదనాన్న అంటున్నారు!
1966 జూన్ 10... ‘చిలకా గోరింక’ రిలీజైంది. నటుడిగా కృష్ణంరాజు తొలి అడుగు వేశారు. అలా ఈ ఏడాదే ఆయన నట జీవిత స్వర్ణోత్సవం. ఇవాళ ఆయన పుట్టినరోజు. యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఈ సీనియర్ హీరో పంచుకొన్న ముచ్చట్లు...
♦ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఎలా అనిపిస్తోంది?
చాలా హ్యాపీ. పరిశ్రమే నా కుటుంబం అనుకున్నా. ఎన్ని ఒడుదొడుకు లొచ్చినా విజయవంతంగా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. అయినా ఎంత సాధించినా ఇంకా చేయాలని ఉండటం సహజం.
♦ఇన్నేళ్ల కెరీర్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా?
ఒకే సినిమా చెప్పలేను. ‘మనవూరి పాండవులు’ ఎవర్గ్రీన్. మేకప్ లేకుండా చేశా. ‘కటకటాల రుద్రయ్య’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’ మెమొరబుల్.
♦‘ఒక్క అడుగు’పేరుతో ఓ సినిమా చేస్తానన్నారు. ఏమైంది?
ఓ మంచి పాయింట్ తీసుకుని చేద్దామనుకున్నా. స్కూల్స్ ఇప్పుడు చదువుల కార్ఖానాల్లా తయారయ్యాయి. బయటి ప్రపంచం ఏంటో వాళ్లకి తెలియడం లేదు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాళ్లు చదువు కోవాలి. అప్పుడే చదువు దేశానికి ఉపయోగపడుతుంది. ఈ కథాంశంతోనే తీద్దామనుకున్నా. కానీ ఎన్నికల హడావిడిలో ఎందుకని ఆలోచన విరమించు కున్నా. త్వరలోనే ఆ సినిమా తీస్తా. కానీ ఈ లోపే మా గోపీకృష్ణా బ్యానర్లో ప్రభాస్‌తో లవ్‌స్టోరీ ప్లాన్ చేశాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాను.
♦ ‘బాహుబలి’ తర్వాత పెరిగిన ప్రభాస్ ఇమేజ్‌కి లవ్ స్టోరీ ఎలా సెట్ అవుతుంది?
‘బిల్లా సినిమా తీసేటప్పుడు కూడా అలాగే అన్నారు. ప్రభాస్‌కు జేమ్స్ బాండ్ టైప్ క్యారెక్టర్ సెట్ అవుతుందని అప్పుడు ‘బిలా’్ల తీశాం. నాకు అప్పట్లో రెబెల్ స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు కూడా నాతో అందరూ ఇలాంటి సినిమాలు తీస్తారనే భయంతో ఒక్క యాక్షన్ ఎపిసోడ్ లేకుండా ‘అమర దీపం’, ‘మనవూరి పాండవులు’ తీశాను. ఆ తర్వాత ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాంటి సినిమాలతో నన్ను నేను పెంచుకుంటూ వెళ్లాను. ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్ను రాజమౌళి అంత ఎత్తులోకి తీసుకెళ్లారు. ఈ మధ్య ఢిల్లీ వె ళ్తే నన్ను పిల్లలు చూసి ‘బాహుబలి’ పెదనాన్న అంటూంటే సంతోషం అనిపించింది. ప్రతి సినిమా ‘బాహుబలి’లా ఉండదు. ఏ సినిమాకా సినిమానే గొప్ప. ప్రభా స్తో సినిమాలో లవ్‌తో పాటు యాక్షన్ ఉంటుంది. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం.
♦ ‘రుద్రమదేవి’లో గణపతిదేవుడిగా చేశారు. భవిష్యత్తులో ఎలాంటివి చేస్తారు?
‘ఎవడే సుబ్రమణ్యం’లోని రామయ్య తరహా మంచి పాత్రలు చేయాలి. నిజజీవితంలో కూడా ఇలాంటి పాత్రలు ఉంటాయి. ఉదాహరణకి వ్యాపార వేత్త ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్. వ్యాపారమే కాక దేశానికి ఏదో ఒకటి చేయాలనుకునే వ్యక్తి ఆయన. అలాంటి పర్పస్‌ఫుల్ పాత్రలొస్తే చేస్తాను.
♦ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లిపీటలెక్కుతారా? అమ్మాయిని సెలెక్ట్ చేశారట?
లేదండీ. అవన్నీ పుకార్లే. ఇన్నాళ్లూ పెళ్లి గురించి అడుగుతుంటే ‘బాహుబలి’ అని వంక పెట్టాడు. ఈ సారి పార్ట్-2 అయ్యాక అని అనక ముందే నేను ఒట్టు వేయించుకున్నా. ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేయాలనుకుంటున్నాం. అమ్మాయిని వెతికే పనిలో పడాలి.
♦ ఈ మధ్య మీకు బాగా నచ్చిన సినిమాలు?
నాకు ‘భలే భలే మగాడివోయ్’ బాగా నచ్చింది. అసలు నాని పోషించిన మతిమరుపు క్యారెక్టర్ నేనైతే ఒప్పుకునేవాణ్ణి కాదేమో. అలాగే ‘ఎవడే సుబ్రమణ్యం’ నచ్చింది. తక్కువ బడ్జెట్లోనే మంచి కంటెంట్‌తో తీశారు.
♦ఇప్పుడొస్తున్న సినిమాలపై మీ అభిప్రాయం?
సినిమా కథాకథనాల్లో చాలా మార్పు వస్తోంది. ఫైట్స్, సాంగ్స్ ఇదివరకు అంతగా చూసేవాళ్లు కారు. కానీ పరిస్థితి మారింది. పాటలు, ఫైట్లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నిర్మాతలు ఇప్పుడు క్యాషి యర్ కన్నా తక్కువ స్థాయిలోకి చేరిపోతున్నారు. టికెట్ రేట్ పెరగడంతో జనాలు థియేటర్లకు రావడం లేదు. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలని ఓ ప్లాన్ వర్కవుట్ చేస్తున్నాం. ఇప్పుడు సరిపడా థియేటర్లు లేవు. ప్రతి పది లక్షల మందికి ఏడెనిమిది థియేటర్లే ఉన్నాయి.
వీటి సంఖ్యను పెంచేలా చిన్న థియేటర్లను తక్కువ టికెట్ రేట్‌తో ఏర్పాటు చేయాలని మా ఆలోచన. అప్పుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. మరిన్ని సినిమాలు వస్తాయి. చైనాలో సినిమా ఎగ్జిబిషన్ ఈ విధానం మీదే నడుస్తోంది. అప్పుడు పరిశ్రమకు ఇంకా కొత్త టాలె ంట్ వచ్చే అవకాశం ఉంటుంది.
దర్శకుడు రాజ మౌళి, నిర్మాతలు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, శోభూ యార్లగడ్డ వంటి ప్రముఖులు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆచరణలోకి రావడానికి మూడు నాలుగు నెలల టైమ్ పడుతుంది. తెలుగు మాత్రమే తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ కలిసి సౌత్ ప్రాజెక్ట్‌గా దీన్ని రూపొందిస్తున్నాం.