బడికి.. బండెడు బరువుతో..
చిన్నారుల వీపులపై ఉంటున్న పుస్తకాల బ్యాగులు బస్తాలను మరిపిస్తున్నాయి. కూలీలు మూటలు మోస్తున్నట్టుగా వీపుపై బండెడు బరువుతో ఉన్న పుస్తకాల బ్యాగులతో చిన్నారులు స్కూళ్లకు వెళ్తున్నారు. శరీరానికి చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేని పసివాళ్లపై.. కేజీలకొద్దీ పుస్తకాల బ్యాగుల భారం మోపడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : సాధారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పుస్తకాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఈ సంఖ్య చాలా అధికంగా ఉంటోంది. ఎల్కేజీ, ఒకటో తరగతి పిల్లలే బండెడు పుస్తకాల బరువుతో బడికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చదివే విద్య ఒకటే అయినా, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల బరువులో తారతమ్యం ఉంటోంది.
ఎందుకిలా..?
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రణాళికబద్ధమైన టైం టేబుల్ ఉంటుంది. దాని ప్రకారం పిల్లలు పుస్తకాలను స్కూలుకు తీసుకెళ్తారు. అదే ప్రైవేట్ విద్యాసంస్థల్లో అయితే ఐఐటీ సిలబస్, ఇంగ్లిషు గ్రామర్, ఫౌండేషన్ కోర్సులంటూ రోజువారీ సిలబస్‌తోపాటు బండెడు పుస్తకాలు తీసుకెళ్లాల్సిందే.
* ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ నాలుగు టెక్ట్స్ బుక్స్, నాలుగు నోట్ బుక్స్ ఉండగా.. అవి సుమారు రెండు కేజీలలోపు బరువు మాత్రమే ఉంటాయి. అదే ప్రైవేటు విద్యా సంస్థలకు వచ్చేసరికి అవే తరగతుల్లో టెక్ట్స్ బుక్స్ 10 నుంచి 15 కిలోల మధ్య, నోట్‌బుక్స్ 15 నుంచి 25 కిలోల మధ్య ఉంటున్నాయి.
* ఇంత బరువు వీపున మోయాల్సి రావడంతో పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.
- విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం పిల్లలు ఏ పాఠశాలలో చదివినా.. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ పుస్తకాలు మినహా మరేవీ వారికి ఇవ్వరాదు. ఈ నిబంధనను ప్రైవేటు పాఠశాలలు తుంగలో తొక్కేస్తున్నాయి. అయినా విద్యాశాఖాధికారులు పట్టించుకోవడం లేదు.
వైద్య నిపుణులేమంటున్నారంటే..
* ఒక విద్యార్థి పుస్తకాల బరువు అతడి బరువులో 1/7 వంతు మించి ఉండరాదు.
* బ్యాగు భుజానికి తగిలించుకున్నాక అది లూజుగా ఉండకూడదు.
* తగిలించుకున్న వెంటనే భుజాలకు బ్యాగు సమాంతరంగా ఉండేలా బెల్టు సరి చేసుకోవాలి. మధ్యలో ఖాళీ రాకూడదు.
* బ్యాగు బరువు తక్కువగా ఉన్నా వెన్నెముక సమస్యలు వస్తాయి.
* విద్యార్థి వంగుతూ నడవకూడదు.
* పుస్తకాల బ్యాగు బరువు అధికమైతే తొలుత వీపు, భుజాల వద్ద నొప్పి ప్రారంభమవుతుంది. చాలామంది పిల్లలు వెనుక నొప్పి వస్తోందని చెబితే అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలోని ఆర్థోపెడిక్ వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. కొందరు సాధారణ నొప్పిలా భావించి వదిలేస్తారు.
* పుస్తకాలు రోజూ మోస్తూండడంతో ఆ బరువు వెన్నుపూసపై పడి పలు సమస్యలు తలెత్తుతాయి. మెడ, కండరాల సమస్యలు, కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కళ్లు తిరగడం, ఎదుగుదలలో లోపం వస్తాయి. గూని వచ్చే ప్రమాదం కూడా ఉంది.
* అధిక బరువు పుస్తకాలు మోసే పిల్లలతో కొన్ని రకాల వ్యాయామాలు చేయించాలని వైద్య నిపుణులు
చెబుతున్నారు.
పరిమితి మించి బరువు మోస్తే ప్రమాదం
పరిమితికి మించి పుస్తకాల బరువు మోస్తే విద్యార్థికి బాల్యం నరకప్రాయమవుతుంది. వెన్నుపూసపై అధిక బరువు పడరాదు. అలా మోస్తే చిన్నతనంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. చాలామంది పిల్లలు భుజాలు, వీపు, వెన్నుపూస ప్రాంతాల్లో నొప్పి అంటారు. అలా అంటే అస్సలు అశ్రద్ధ చేయరాదు. బరువు ఎక్కువగా ఉంటే అది వెన్నెపూసపై పడి మెదడు, కండరాలు, కాళ్లు చేతుల తిమ్మిర్లవంటి సమస్యలు వస్తాయి.
- డాక్టర్ విజయ్‌కుమార్, సాయి ఆర్థోపెడిక్ ఆసుపత్రి
ఎక్కువ బరువు ఉంటే చర్యలు
విద్యార్థి సగటు బరువులో కొంతమేర మాత్రమే పుస్తకాలు ఉండాలి. దీనిపై పేరెంట్స్ కమిటీ స్కూలు యజమాన్యంతో మాట్లాడాలి. అధిక పుస్తకాల బరువును పిల్లలతో మోయిస్తున్న స్కూలు యాజమాన్యాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి విద్యాహక్కు చట్టం ఆదేశాలు ఉన్నాయి.
- ఎస్.అబ్రహం, ఉపవిద్యాశాఖాధికారి