వినోదం అందించే పిల్లలకు పుట్టెడు కష్టాలు
వీధి బాలలు, రైల్వే స్టేషన్లలో తిరుగుతున్న పిల్లలు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు.. వీళ్లందరినీ చూస్తున్నప్పుడల్లా బాలల హక్కుల హననం గురించి గుర్తుకొస్తుంది. కానీ, కష్టాలు పడుతున్న పిల్లలంటే వీళ్లేనా? కాదు.. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను చూసినా, సినిమాలు.. సీరియళ్లు.. రియాల్టీ షోలలో చేస్తున్న పిల్లల్ని చూసినా వీధిబాలల కంటే మరింత కష్టాలు పడుతున్నారు! ఈ విషయం పలు సర్వేలలో ఇప్పటికే బయటపడింది. ఇదే అంశాన్ని గురించి ప్రస్తావించారు పిల్లల హక్కుల ఉద్యమకారిణి, దర్శకురాలు సరస్వతీ కవుల. 'సాక్షి.కామ్'కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల హక్కుల గురించి ఆమె పలు విషయాలు తెలిపారు.
కార్పొరేట్ పాఠశాలల్లో చదివే పిల్లలపై విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. ఆరో తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ అంటూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాలల్లోనే నూరేస్తుంటే ఇక పిల్లలకు ఆడుకోడానికి సమయమే ఉండట్లేదు. స్కూళ్లలో ఆడుకోడానికి అరకొరగా సమయం ఇస్తున్నా.. అప్పుడు కూడా ప్లేగ్రౌండులోకి పంపకుండా కంప్యూటర్లతో ఆడిస్తున్నారు. దీంతో వాళ్లమీద విపరీతమైన ఒత్తిడి ఉంటోంది. భవిష్యత్తు అంటూ లేకుండా పోతోంది. చాలామంది పిల్లలకు అసలు బాల్యం అంటే ఏంటో, ఆటలంటే ఏంటో కూడా తెలియట్లేదు. అయితే ఇందులో తప్పు కేవలం స్కూళ్లదే కాదు. తల్లిదండ్రులు, ఈ సమాజం కూడా అందుకు సమాన బాధ్యత వహించాల్సిందే. చదువంటే కేవలం ఉద్యోగం సంపాదించే సాధనంగా, పిల్లలంటే డబ్బు సంపాదించే యంత్రాలుగా చూస్తున్నారు. పిల్లలు కూడా ఇప్పుడున్న విద్యావిధానం కారణంగా యాంత్రికంగానే పనిచేస్తున్నారు తప్ప.. సృజనాత్మక రంగాలవైపు ఎక్కువగా వెళ్లట్లేదు. ముందుగా తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారితే మొత్తం వ్యవస్థ చక్కబడుతుంది.
వినోద రంగంలోని పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. పిల్లల్లోని కళాత్మక హృదయాలను ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నా, వాస్తవానికి అక్కడ జరిగే తతంగం వేరు. రియాల్టీ షోలలో పోటీ మరీ ఎక్కువగా ఉండటంతో ఓడిపోయిన పిల్లలు మానసికంగా తీవ్రంగా దెబ్బతింటున్నారు. అది వాళ్ల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతోందని మానసిక వైద్యనిపుణులు కూడా అంటున్నారు. చిన్నతనంలోనే బాగా వెలుగులోకి వచ్చినవాళ్లు ఆ తర్వాత ఎదురయ్యే కష్టనష్టాలను ఓర్చుకోలేకపోతున్నారు.
టీవీ, సినిమా కెమెరాల ముందు భారీ లైట్ల మధ్య పనిచేయడం అంత సులభమైన పనికాదు. ఇందుకు బోలెడంత శారీరక, మానసిక శ్రమ అవసరం. పనిచేసే సమయాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. రాత్రిపూట పిల్లలు నిద్రపోవాలన్న కనీస విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. అర్ధరాత్రి వరకు కూడా షూటింగులు కొనసాగడం, వాటికోసం పిల్లలను నిద్రపోనివ్వకుండా ఉంచడం లాంటివి తరచు కనిపిస్తుంటాయి. వీధిబాలలైతే తమకు ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతారు. వీళ్లకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఉండట్లేదు. చిట్టడవుల్లో, భయానక ప్రదేశాలలో షూటింగులు చేయడం వల్ల పిల్లల మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోంది.