చిన్నారుల కోసం ప్రత్యేక కోర్టు
-ప్రారంభించిన హైకోర్టు ఏసీజే జస్టిస్ రమేష్ రంగనాథన్
-చిన్నారులు భయం లేకుండా సాక్ష్యం ఇవ్వవచ్చు : డీజీపీ
సాక్షి, హైదరాబాద్
అఘాయిత్యాలకు గురయ్యే చిన్నారులు...నిర్భయంగా, స్వేచ్ఛగా సాక్ష్యం ఇచ్చేందుకు వీలుగా నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం ప్రారంభించారు. జస్టిస్ ఫర్ కేర్, తెలంగాణ సీఐడీ, నాంపల్లి క్రిమినల్ కోర్టులు సంయుక్తంగా ఈ కోర్టును ఏర్పాటు చేశాయి. చిన్నారులు ఎటువంటి భయానికిలోనుకాకుండా అహ్లాదకరమైన వాతావరణలో స్వేచ్ఛగా సాక్ష్యం ఇచ్చేలా కోర్టును రూపొందించారని ఈ సందర్భంగా నిర్వాహకులను ఆయన అభినందించారు.
చిన్నారులు భయపడకుండా సాక్ష్యం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక కోర్టు ఎంతో దోహదపడుతుందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది బంధువులు, బాగా తెలిసిన వారే ఉంటున్నారని, ఈ పరిస్థితుల్లో చిన్నారులు వారిని కోర్టు హాల్లో చూస్తూ స్వేచ్ఛగా సాక్ష్యం చెప్పలేకపోతున్నారని, దీంతో మెజారిటీ కేసులు వీగిపోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా కోర్టుల్లో చిన్నారులు నిర్భయంగా సాక్ష్యం ఇవ్వడం ద్వారా నేరం రుజువై నిందితులకు 100 శాతం శిక్షలుపడేలా చేయవచ్చన్నారు. పోలీసు శాఖలో కేవలం 5 శాతం మంది మహిళా అధికారులు మాత్రమే ఉన్నారని, త్వరలో చేపట్టబోయే నియామకాల్లో 33 శాతం పోస్టులను మహిళలతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు.
సివిల్ దుస్తుల్లోనే న్యాయమూర్తి, న్యాయవాదులు, ఇతర సోషల్ వర్కర్ వీరి నుంచి సమాచారాన్ని సేకరిస్తారని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని పేర్కొన్నారు. నిందితులను చూసి బాధిత చిన్నారులు భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే నిందితుడు...చిన్నారి ఇచ్చే సాక్ష్యాన్ని వినే ఏర్పాటు చేశామన్నారు. జంట నగరాల పరిధిలోని న్యాయమూర్తులు శ్రమ, సమయం వృధా అనుకోకుండా చిన్నారుల సాక్ష్యాన్ని ఈకోర్టుకే వచ్చి నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1640 పోస్కో చట్టం కింద నమోదైన కేసులు విచారణలో ఉన్నాయన్నారు. చిన్నారులు స్వేచ్ఛగా సాక్ష్యం ఇవ్వాలంటే ఈ తరహా కోర్టులను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఐడీ ఐజీ సౌమ్యా మిశ్రా సూచించారు. ఢిల్లీలో 4, గోవాలో 1 కోర్టు చిన్నారుల కోసం పనిచేస్తున్నాయని, తెలంగాణలో ఏర్పాటు చేసింది 6వ కోర్టు అన్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన కోర్టుకు సరైన సౌకర్యాలు లేవని, సౌకర్యాలను మెరుగుపర్చాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జితేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రవీందర్‌రెడ్డి, రాజ్‌కుమార్, చక్రవర్తి, సుదర్శన్, డ్యానీరూత్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, ఉపాధ్యక్షులు నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
దక్షిణ భారతదేశంలోనే మొదటిది..
చిన్నారులను ఆకట్టుకునేలా రంగురంగులూ, ఆటబొమ్మలూ ఏర్పాటు చేశారు. భారత దేశంలో గోవా, ఢిల్లీ తర్వాత దక్షిణ భారతేదేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా కోర్టు హాల్‌ను రంగురంగులతో తీర్చిదిద్దారు. అలాగే చిన్నారులు అడుకునేందుకు వారికి అటబొమ్మలూ ఏర్పాటు చేశారు.